Bandi Sanjay Fires on State Government: రాష్ట్రంలో ఉపాధ్యాయ, ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులపై బీజేపీ ఉద్యమిస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. నిన్న ప్రగతి భవన్ ముట్టడి కోసం వెళ్లిన ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, చిన్నారులపై పోలీసుల చేసిన దాడిని ఖండిస్తున్నామని అన్నారు. జీవో 317 తీసుకొచ్చి సమస్యను సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పరిష్కారంపై కూడా ఆలోచించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
తక్షణమే ప్రగతి భవన్ ఈ ఘటనపై కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. సీఎం క్షమాపణ చెప్పే వరకు బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. 317 జీవో, ఉపాధ్యాయ, ఉద్యోగుల బదిలీల అంశంపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చిస్తామని ప్రకటించారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల పక్షాన పోరాడేందుకు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. దీనిని తప్పనిసరిగా సవరించాల్సిందే అని స్పష్టం చేశారు.
టీచర్లకు జీతాలు కూడా అడుక్కునే పరిస్థితి వచ్చింది: ఈ క్రమంలోనే టీచర్ల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలని బండి సంజయ్ సూచించారు. జీవో 317తో టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తద్వారా 34 మంది ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. టీచర్లకు జీతాలు కూడా అడుక్కునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో స్కావెంజర్లను తీసేశారని దుయ్యబట్టారు. టీచర్లు బాత్‌రూంలు కడగాల్సిన దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోసారి సకల జనుల సమ్మె తరహా పరిస్థితులు వస్తున్నాయి: అదేవిధంగా ప్రభుత్వం ఉపాధ్యాయులకు నాలుగు డీఏలు బకాయి పెట్టారని బండి సంజయ్ గుర్తు చేశారు. వారికి టీచర్లకు పీఆర్సీలు, డీఏలు, పదోన్నతులు లేవని ధ్వజమెత్తారు. టీచర్ల బదిలీల్లో అక్రమాలు జరుగుతున్నాయిని ఆరోపించారు. ఈ విషయంలో కేసీఆర్ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మరోసారి సకల జనుల సమ్మె తరహా పరిస్థితులు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. పోలీసు ఉద్యోగాల నియామకాలు కూడా సరిగ్గా జరగట్లేదని వివరించారు. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఉదంతం ఉద్దేశించి ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని విమర్శించారు. సీఎం, కుటుంబ సభ్యులకు తప్ప రాష్ట్ర ప్రజలకు భద్రత లేదని బండి సంజయ్ దుయ్యబట్టారు.
అసలేం జరిగిదంటే: భార్యాభర్తల బదిలీలపై ఉపాధ్యాయులు కొద్దిరోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. జీవో నంబర్ 317ను సవరించి.. ఎవరి స్థానిక జిల్లాకు వారిని కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న చిన్నారులతో కలిసి ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. దీంతో ట్రాఫిక్ జామ్ కావడంతో పాటు.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫలితంగా ఉపాధ్యాయ దంపతులను పోలీసులు.. అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు స్థానికత చూశారని... కానీ ఇప్పుడెందుకు చూడటం లేదని వారు ప్రశ్నించారు.
"నిన్న ప్రగతి భవన్ ముట్టడి కోసం వెళ్లిన ఉపాధ్యాయులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం. ఉపాధ్యాయుల కుటుంబాలను ఛిన్నాభిన్నం కోసం తెచ్చిన జీవో 317. టీచర్లు జీతాలు కూడా అడుక్కునే పరిస్థితి వచ్చింది. పాఠశాలల్లో స్కావెంజర్లను తీసేయడం దారుణం. టీచర్లకు పీఆర్సీలు, డీఏలు, పదోన్నతులు లేవు. టీచర్లకు నాలుగు డీఏలు బకాయి పెట్టారు." - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి: జీవో నంబర్ 317 సవరణకు ఉపాధ్యాయుల డిమాండ్ ప్రగతి భవన్ ముట్టడి ఉద్రిక్తం
భార్యాభర్తలు ఒకే చోట పని చేసేలా బదిలీలకు డిమాండ్ రణరంగంగా మారిన ఆందోళన