భాజపా(bjp) 2023లో అధికారంలోకి రాగానే ప్రగతి భవన్, ఫామ్ హౌస్‌ను లక్ష నాగళ్లతో దున్ని... బడుగువర్గాల వారికి పంచుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay) అన్నారు. రాష్ట్రంలో 18శాతం ఉన్న దళితుల్లో ఏ ఒక్కరికీ ముఖ్యమంత్రిగా పని చేసే అర్హత లేదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన బడుగుల ఆత్మ గౌరవ పోరులో ఆయన పాల్గొన్నారు. ప్రగతి భవన్‌లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్న ఆయన... అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఆ దస్త్రంపైనే పెడతామని ప్రకటించారు.
పోడు భూముల పట్టాలివ్వాలి
దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి, గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇవ్వాలని, బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానన్న సీఎం కేసీఆర్... పంట చేతికొచ్చాక పోడు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మూడెకరాల భూమి ఇస్తానన్న సీఎం... ఎస్సీలకు రూ.10 లక్షలు ఇస్తానని మళ్లీ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి దళితుడికి రూ.30లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఓట్లు కొనుగోలు చేసే ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్, ఆత్మగౌరవ భవనాలు ఎక్కడికి పోయాయని కేసీఆర్‌ను ప్రశ్నించారు. రాష్ట్రంలో కులవృత్తులను సీఎం సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు.
ఫామ్ హౌస్‌ను పంచుతాం
2023 ఎన్నికల్లో భాజపాదే విజయం. మేం అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్, ఫామ్ హౌస్‌ను లక్ష నాగళ్లతో దున్నుతాం. ఆ భూమిని దళితులకు పంచుతాం. శాంతి భద్రతల పేరుతో భాజపా కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అనుమతులతోనే మేం ధర్నా చేపడుతున్నాం. అనుమతుల్లేకుండా మేం నిరసనలు చేస్తే మమ్మల్ని అడ్డుకునే శక్తి సీఎం కేసీఆర్‌కు లేదు. ఇప్పటికే రెండు సార్లు అసెంబ్లీని ముట్టడించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల సీఎం కేసీఆర్ వైఖరిని బహిర్గతం చేయడానికే ఈ ఆత్మ గౌరవ పోరును ప్రారంభించాం. పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలి.
-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
వైఫల్యాలపై చర్చ
ఈ ధర్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేళ్ల పాలన వైఫల్యాలను భాజపా నేతలు ఎండగట్టారు. హుజురాబాద్ ఎన్నికల కోసమే దళితబంధు పథకం పెడుతున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో దళితులకు రూ.10 లక్షలు ఇస్తానంటున్నారు కానీ... వాటితో ఒక్క ఎకరం భూమి రాదని అన్నారు. ఒక్కొక్కరికి రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీల పట్ల సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదన్నారు.
అందుకే భూములకు వేలం
రాష్ట్రమంతా దళితబంధును సీఎం కేసీఆర్ అమలు చేయాలి. భాజపా వల్లే దళితబంధు పతకం వచ్చింది. హుజురాబాద్ ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకే ప్రభుత్వ భూములను వేలం వేశారు. తెరాస నుంచి తెలంగాణకు విముక్తి కలగాలంటే ఈటల రాజేందర్‌ను గెలిపించాలి.
-డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు
ఓటు బ్యాంకుగానే..
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంకుగా మాత్రమే సీఎం కేసీఆర్ పరిగణిస్తున్నారని ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. తెరాసలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు స్థానం లేదన్నారు. తండ్రి, కొడుకులే పార్టీకి అధ్యక్షుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారని మండిపడ్డారు. బడుగులకు పార్టీని నడిపించే సత్తా లేదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కనీసం సంచార జాతులు అంటే కూడా అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఏడేళ్ల గడీల పాలనను అంతమొందించేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని కోరారు.
గద్దె దించుతాం
పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్... దానిని విస్మరించడమే కాకుండా పోడు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇచ్చింది. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్‌ను గద్దె దించుతాం.
-సోయం బాబురావు, ఆదిలాబాద్ ఎంపీ
పోరాటాలకు సిద్ధం
బడుగులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటాలకు భాజపా సిద్ధమవుతోందని బండి సంజయ్ ప్రకటించారు. ఈ ధర్నాలో భాజపా నేతలు లక్ష్మణ్, డి.కె.అరుణ, ఎంపీ సోయంబాబురావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు, స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నా కోసం రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఇందిరా పార్కు పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. భాజపా శ్రేణులు ధర్నా చౌక్‌కు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసులు అప్రమత్తమై... భారీగా మోహరించారు.
ఇదీ చదవండి: KTR: 'కేసీఆర్ సీఎం అయ్యాకే సిరిసిల్లకు మంచిరోజులు'