Bandi Sanjay fires on BRS and MIM: ప్రజా సమస్యలు తెలుసుకుని బీఆర్ఎస్ నియంతృత్వ విధానాలను అంతమొందించడమే లక్ష్యంగా ఈ కార్నర్ మీటింగ్‌లను నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ పరిధిలో చెరువులు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపించారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఆలయాలను కూల్చివేస్తామన్న కేటీఆర్... పాతబస్తీలో ఉన్న మసీదులను కూడా కూల్చేయాలని సవాల్ విసిరారు.
సచివాలయ భవన గుమ్మటాలు కూలుస్తాం : బస్తీల్లోని ప్రజల ఇబ్బందులు ప్రభుత్వానికి తెలిపేందుకే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కార్యక్రమమని బండి సంజయ్ తెలిపారు. బీఆర్ఎస్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటామని తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. నూతనంగా నిర్మించిన సచివాలయ భవన డోమ్‌లను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చివేసి... భారతీయ తెలంగాణ సంస్కృతి ప్రకారం పునర్మిస్తామని స్పష్టం చేశారు.
'భాజపా అధికారంలోకి వస్తే సచివాలయ రూపురేఖలు మారుస్తాం. సచివాలయానికి ఉన్న గుమ్మటాలు (డోమ్‌లను) కూలుస్తాం. మన సంస్కృతికి వ్యతిరేకంగా ఉన్న గుమ్మటాలు కూలుస్తాం.సచివాలయాన్ని అక్బరుద్దీన్ తాజ్‌మహల్‌తో పోల్చారు. అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు విని కేసీఆర్ ఆనందించారు. పాతబస్తీ వెనుకబాటుకు ప్రధాన కారణం.. ఎంఐఎం, బీఆర్ఎస్.' - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు : సచివాలయ నిర్మాణ విషయంలో సీఎం కేసీఆర్ ఇష్టారీతిగా ప్రజాధనాన్ని ఖర్చు చేశారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి నుంచి ఈనెల 25 వరకు 1100 కార్నర్ మీటింగ్‌లను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై దృష్టి సారించి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడతామని పేర్కొన్నారు. అసెంబ్లీలో ఎంఐఎం, బీఆర్ఎస్ నాయకులు డ్రామాలు ఆడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్న బండి సంజయ్.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు.
గులాబీ తోటలో కమలవికాసమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే, క్షేత్రస్థాయిలో కేడర్‌ను పెంచుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం పార్టీలో చేరికలు, సంస్థాగత బలోపేతంపై రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. పశ్చిమబెంగాల్ తరహా వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది.
వీధి సభల్లో మాట్లాడే అంశాలపై ఇప్పటికే 800 మందికి రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక శిక్షణనిచ్చింది.కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరించడంతోపాటు తెలంగాణకి మోదీ సర్కారు కేటాయించిన నిధుల వంటి అంశాలపై స్పష్టత ఇవ్వనున్నారు. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ మోసాలు, వైఫల్యాలను ఎండగట్టనున్నారు. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేయనున్నారు.
ఇవీ చదవండి: