పోలీసుల కనుసన్నల్లోనే విచక్షణ రహితంగా టీఆర్ఎస్ నేతలు ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పార్టీ నేతలతో కలిసి బంజారాహిల్స్‌లోని ఎంపీ అరవింద్ నివాసాన్ని పరిశీలించిన ఆయన.. దాడికి సంబదించిన సమాచారాన్ని అర్వింద్‌ను అడిగి తెలుసుకున్నారు. దాడి చేసిన వారు ఎందుకు చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు.
దాడికి సంబంధించిన విషయాలు గురించి మాట్లడిన ఆయన.. దాడి చేసిన వారు ఫర్నిచర్‌తో పాటు దేవుళ్ల చిత్ర పటాలపై దాడి చేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కుటుంబ అహంకారాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్న ఆయన.. ప్రజాస్వామ్యంలో విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలి తప్పితే.. దాడి చేస్తారా అని ప్రశ్నించారు. ఇళ్లపై దాడులు చేయడం మంచిది కాదని.. కుటుంబ సభ్యులకు రాజకీయాలతో ఏం సంబంధమని పేర్కొన్నారు. రాజకీయాల కోసం కేసీఆర్ సొంత బిడ్డను పావుగా వాడుకుంటున్నారని విమర్శించారు.
కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేర నుంచి తరిమికొట్టేందుకు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన వ్యాఖ్యనించారు. కేసీఆర్ తక్షణమే ఘటనపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. దాడిలో సంబంధం ఉన్న సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆర్ కుటుంబంలో అంతర్గత ఘర్షణలు ప్రారంభమయ్యాయని ఆరోపించిన ఆయన.. కేసీఆర్ తండ్రిగా, ముఖ్యమంత్రిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు.
"ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. దాడికి పోలీసులే సహకరించారు. దాడిలో ఫర్నీచర్‌తో పాటు దేవుళ్ల చిత్ర పటాలు కూడా ధ్వంసమయ్యాయి. సీఎం కేసీఆర్ కుటుంబ అహంకారాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలి తప్పితే.. దాడి చేస్తారా? రాజకీయాల కోసం కేసీఆర్ సొంత బిడ్డను పావుగా వాడుకుంటున్నారు"- బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి: