Bandi Sanjay Nirudyoga Deeksha: భాజపా దీక్షకు వేలాదిగా తరలివస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. భాజపా చేపడుతున్న దీక్షతో ప్రభుత్వానికి వణుకు పుట్టిందని.. అందుకే నిరుద్యోగ దీక్షను కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాత్రికి రాత్రే ర్యాలీలు, సభలు నిషేధిస్తూ జీవో ఇచ్చారన్నారు. నిరుద్యోగ దీక్షతో రాష్ట్రంలో చైతన్యానికి ప్రయత్నిస్తున్నామన్న బండి సంజయ్.. అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారు..
Bandi Sanjay on trs government: ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతుంటే.. ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా గ్రూప్-1, డీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో 12 వేల మంది విద్యా వాలంటీర్లు, ఏడు వేలకు పైగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని ఆరోపించారు. ఆరు వందలకు పైగా మిషన్ భగీరథ కార్మికులను తొలగించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 600కు పైగా నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాధనలో 1200 మంది విద్యార్థులు అసువులు బాశారని బండి సంజయ్ గుర్తు చేశారు.
అడ్డుకుని తీరుతాం..
ఎన్నికలు వచ్చినపుడే తెరాస ప్రభుత్వానికి ఉద్యోగాలు ఇవ్వాలని గుర్తొస్తాయని... ఉపఎన్నికల వేళ 50 వేల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని బండి సంజయ్ గుర్తు చేశారు. 2014, 2018 ఎన్నికల్లోనూ ఉద్యోగాల పేరుతో మోసగించారని ఆరోపించారు. జనవరిలోపు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుంటే శాసనసభ సమావేశాలను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. నిరుద్యోగ యువత కోసం అసెంబ్లీ లోపల, వెలుపల నిరసనలు తెలుపుతామన్నారు.
అసెంబ్లీ సమావేశాలు అడ్డుకుంటాం..
'తెలంగాణ సాధనలో 1,200 మంది విద్యార్థులు అసువులు బాశారు. ఎన్నికలు వచ్చినపుడే ఉద్యోగాలు ఇవ్వాలని గుర్తొస్తుంది. ఉపఎన్నికల వేళ 50 వేల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. 2014, 2018 ఎన్నికల్లోనూ ఉద్యోగాల పేరుతో మోసగించారు. ప్రభుత్వం జనవరిలోగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇవ్వకపోతే అసెంబ్లీ సమావేశాలు అడ్డుకుంటాం. నిరుద్యోగ యువత కోసం అసెంబ్లీ సమావేశాలు అడ్డుకుంటాం. శాసనసభ లోపల, వెలుపల నిరసనలు తెలుపుతాం.' -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
అందుకే ఈ నాటకాలు..
రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో భాజపా గెలిచి తీరుతుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులను అయోమయానికి గురి చేసేందుకే ధాన్యం కొనుగోళ్ల నాటకమాడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంటర్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. రాష్ట్రంలో బెంగాల్ తరహా పాలన నడుస్తోందని సంజయ్ అన్నారు.
ఇదీ చదవండి:
Niranjan reddy on BJP And congress : 'కాంగ్రెస్ త్వరలోనే భాజపాలో విలీనం కావడం ఖాయం'