భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాల జన జీవనాన్ని ఉద్దేశించి హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడారు. కుండపోతగా కురిసిన వానలతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు.
ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి.. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. వరదల వల్ల 16 మంది మృత్యువాత పడటం బాధాకరమన్నారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్తిస్తున్నానని చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవాలని సూచించారు.