గ్రేటర్ ఎన్నికల్లో 18 ఏళ్ల తర్వాత బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. ఇన్నేళ్లుగా జరిగిన ఎన్నికల్లో ఈవీఎంపై ఓటేసిన నగరవాసికి.. బ్యాలెట్ పెట్టెలు కొత్తగా కనిపిస్తాయి. కాబట్టి ఓటరు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గందరగోళానికి గురై ఓటేస్తే స్టాంపు ముద్ర రెండు గుర్తులపై పడి ఓటు వృథా అయ్యే అవకాశముందని గుర్తుచేస్తున్నారు. ఈవీఎంల లెక్కింపుతో పోలిస్తే బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నిదానంగా ఉంటుంది. అంచనా ప్రకారం గతంలో మాదిరి పోలింగ్ శాతం 50 శాతానికి లోపు ఉంటే 150 డివిజన్ల ఫలితాలు రాత్రి 8గంటల్లోపు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
లెక్కింపు ఇలా..
ఓటింగ్ తరువాత ఎన్నికల అధికారి బ్యాలెట్ పెట్టెలకు ఏజెంట్ల సమక్షంలో సీల్ వేసి ఒక సంఖ్య రాస్తారు. వాటిని భద్రపరిచి సర్కిళ్లవారీగా ఎంపిక చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తారు. లెక్కింపు రోజున ఉదయం 6గంటల నుంచే బ్యాలెట్ పెట్టెలను కౌంటింగ్ హాళ్లకు తరలిస్తారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రతి డివిజన్‌కు ప్రత్యేక కౌంటింగ్ హాల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఒక్కో కౌంటింగ్ హాల్‌కు రెండు వరుసల్లో ఏడేసి చొప్పున మొత్తం 14 లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. వాటికి చివరన డివిజన్ రిటర్నింగ్ అధికారి(ఆర్వో) టేబుల్ ఉంటుంది. ఆర్వో వద్ద పోటీ చేసిన అభ్యర్థులకు, ఎన్నికల ఏజెంట్లకు క్రమసంఖ్యలో కుర్చీలు కేటాయిస్తారు. లెక్కింపు టేబుళ్లకు ఎదురుగా జారీ ఏర్పాటు చేసి అవతలి వైపున పార్టీల వారీగా కౌంటింగ్ ఏజెంట్లు కూర్చునేందుకు ఆర్వో అనుమతిస్తారు. వీళ్లని మినహా ఎవరినీ లెక్కింపు కేంద్రంలోకి అనుమతించరు.
మొదట తపాల ఓట్ల లెక్కింపు..
తపాల ఓట్లను ఆర్వో టేబుల్‌పై ఉంచిన డబ్బాలో వేస్తారు. వాటిపై ఉండే ముద్రలను చూడకుండా ప్రతి 25 బ్యాలెట్ పేపర్లను ఓ కట్టగా కడతారు. అనంతరం అభ్యర్థుల వారీగా తపాల ఓట్లను లెక్కించి తుది సంఖ్యలను ఆర్వో ప్రకటిస్తారు. అదే సమయంలో సిబ్బంది బ్యాలెట్ పెట్టెలను టేబుళ్ల వద్దకు తీసుకొస్తారు. దాని మూతిపై ఎన్నిక రోజు వేసిన సీలును, రాసిన సంఖ్యను పోటీ చేసిన అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు ధ్రువీకరించాలి.
25 పేపర్లు కట్టగా...
క్రమపద్ధతిలో ఆర్వోటేబుల్ వద్దకు వస్తున్న బ్యాలెట్ పేపర్లను కుప్పగా పోసి లెక్కింపు ఏజెంట్లు చూస్తుండగా ప్రతి 25 పేపర్లను ఓ కట్టగా కడతారు. 25 కన్నా తక్కువగా మిగిలిని వాటిని పక్కన పెడతారు. 25 కన్నా తక్కువ ఉన్నాయని పక్కన పోసిన అన్ని బ్యాలెట్ పెట్టెల ఓట్లను చివర్లో 25 చొప్పున కట్ట కడతారు. ఆఖర్లో డివిజన్ మొత్తానికి ఓ కట్ట మాత్రమే 25 కన్నా తక్కువ ఓట్లతో ఉంటుంది. దానిని మాత్రం పక్కన పెట్టి మిగిలిన వాటిని డ్రమ్ములో తారుమారు చేస్తారు.
తర్వాత ఒక్కో టేబుల్‌కు 40 కట్టలను (1,000 ఓట్లు) కలిపి మొత్తం 14 టేబుళ్లకు 14,000 వేల ఓట్లను ఇస్తారు. వాటి లెక్కింపు పూర్తయ్యాక మిగిలిన కట్టలను సమానంగా పంచుతారు. రబ్బరు స్టాంపు సరిగా లేని బ్యాలెట్ పేపర్లను టేబుళ్ల సూపర్వైజర్లు ఆర్వోకి ఇస్తారు.
వాటిని అభ్యర్థుల సమక్షంలో పరిశీలించి ఆర్వో తుది నిర్ణయం తీసుకుంటారు. టేబుళ్ల వద్ద స్పష్టత వచ్చిన ఓట్లను పార్టీల గర్తులుండే డబ్బాల్లో ఉంచి.. సంఖ్యను రిజిస్టరులో నమోదు చేస్తారు. చివర్లో అన్ని టేబుళ్ల నుంచి వచ్చిన ఓట్లను పార్టీల వారీగా లెక్కించి, వాటికి తపాల ఓట్లను కలిపి అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లను ప్రకటిస్తారు.
సమంగా వస్తే..
ఎవరైనా ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు సమంగా వచ్చినప్పుడు.. బ్యాలెట్ పేపరుపై సదరు అభ్యర్థుల క్రమసంఖ్య ఐదేసి చిట్టీల్లో రాసి, మొత్తం పది చిట్టీలను ఓ డబ్బాలో వేసి, వాటిలోంచి ఓ చిట్టీని అభ్యర్థుల సమక్షంలో ఆర్వో బయటకు తీస్తారు. అందులో ఏ క్రమసంఖ్య ఉంటే ఆ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటిస్తారు.
ఇదీ చూడండి: లబ్... డబ్... లబ్... డబ్... కేవలం 24 గంటలే!