Balagam Movie Writer Ramesh : ఇతను పుట్టింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. చిన్నప్పటి నుంచి కష్టాలతోనే ఇతని సావాసం. చిన్నతనంలోనే సినిమా పిచ్చి పట్టుకుంది. దానికి తోడు కష్టాలు. కానీ, తన తల్లి ప్రోత్సాహంతో ప్రాథమిక విద్యాభ్యాసం స్థానికంగానే పూర్తి చేసి, ఇంటర్ వరంగల్‌లో చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. వెంటనే మంచి ఉద్యోగంలో చేరాడు. కానీ, ఆ లగ్జరీ లైఫ్ అతనికి సంతృప్తినివ్వలేదు. చిన్నప్పటి నుంచి ఉన్న సినిమా కల నిద్రలేకుండా చేసింది. మంచి జీతం గల ఉద్యోగాన్ని వదిలి, తన కలను వెంటాడుతూ హైదరాబాద్ చేరుకుని ఈ రోజు తనకంటూ ఓ గుర్తింపు సాధించుకున్నాడు.
పరిచయమే అనుభవం: ఈ యువ రచయిత పేరు రమేశ్ ఎలిగేటి. మంచిర్యాల జిల్లా మందమర్రి వాసి. బలగం సినిమాకు కథా విస్తరణ, మాటలు రాయండతో పాటు స్క్రీన్‌ప్లేలో భాగమయ్యాడు. గోల్కొండ హైస్కూల్ చిత్రానికి సహాయ దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ చిత్రంతోనే ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా నేర్చుకున్నాడు. ఆ ఉత్సాహంతో ఉయ్యాల జంపాల, పిట్టగోడ, నరుడా ఓ నరుడా చిత్రాలకు పనిచేశాడు. బలగం సినిమా దర్శకుడు వేణు యెల్దండితో తన పరిచయం తనకు మంచి అనుభవాన్ని ఇచ్చిందని చెబుతున్నాడు.
"జాతిరత్నాలు డైరెక్టర్‌తో నాకు, వేణుకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. స్టోరీ విషయంలో నాది, వేణుది సిమిలర్ ఐడియా ఉండటం వల్ల అనుదీప్ మమ్మల్ని కలిపారు. ఫస్ట్ మీట్లో మా ఐడియాలు పంచుకున్నాం. వేణు మంచి రూటెడ్‌గా ఆలోచిస్తారు. నాగరాజు, వేణు, నేను ముగ్గురం స్టోరీ రాసేటప్పుడు ఎక్కడా కంఫర్ట్ ఇచ్చుకోలేదు. బెటర్మెంట్ వచ్చేదాకా దానిని రాసేవాళ్లం. మా ముగ్గురి ప్రయాణాన్ని చాలా ఎంజాయ్ చేశాను. ఇక ముందు కూడా కొనసాగాలని కోరుకుంటున్నాను." - రమేశ్ ఎలిగేటి, సహ రచయిత, బలగం చిత్రం
ప్రతీ సీన్ ప్రాణం పెట్టి రాశాము: బలగం కథను ముగ్గురు రచయితలు రాశారు. వేణు, నాగరాజు, రమేశ్. ప్రతీ సీన్ ప్రాణం పెట్టి రాశామంటున్నాడు రమేశ్. అందరికీ అందరి కుటుంబాల్లో కనుల ముందు కనిపించే కథనే సినిమాగా తీస్తున్నాం కాబట్టి ఎక్కడా రాజీ పడకుండా రాశామని చెబుతున్నాడు. అందరికీ తెలిసిన కథను చెప్పేటప్పుడే మనపై మరింత భయం, బాధ్యత ఉంటుందని అంటున్నాడు. కానీ, ఈ కథ రాసే సమయంలో చాలా ఎంజాయ్ చేస్తూ రాశామని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాడు.
ప్రయాణంలో ప్రతీ విషయం పాఠమే: ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందుతున్న బలగం సినిమా కథా రచనలో తాను భాగమైనందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. చిత్రసీమలో విజయం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేమంటున్నాడు. ప్రయాణంలో ప్రతీ విషయం పాఠమే అని చెబుతున్నాడు ఈ యువకుడు. ఈ ప్రయాణంలో తన వెంట నిలిచిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాడు. కచ్చితంగా దర్శకుడిగా వెండితెరపై వెలగడమే తన లక్ష్యమంటున్నాడు రమేశ్.
అసైన్మెంట్గా: సినిమా రంగంలో రమేష్ ప్రతిభను గుర్తించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం.. తనను అతిథిగా పిలిచి గౌరవించింది. ఓయూ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ విద్యార్థులతో కలిసి బలగం చిత్రాన్ని చూసి రమేష్ ప్రతిభను కొనియాడారు. తమ పూర్వ విద్యార్థి ఒక మంచి చిత్రంలో భాగమైనందుకు గర్వంగా ఉందన్నారు. అంతేగాకుండా బలగం చిత్రాన్ని విశ్వ విద్యాలయ విద్యార్థులకు ఒక అసైన్మెంట్గా ఇవ్వనున్నట్లు ప్రకటించడం విశేషం. రమేష్ కృషి కళాశాలలోని ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు.
మొదట్లో కొంత భయం: ఉద్యోగం మానేసి సినిమాలవైపు అడుగేసిన దశలో రమేష్ తల్లి భూదేవి కొంత కలత చెందింది. కొడుకు జీవితం ఏమవుతుందోనని బాధపడింది. ఇది కూడా ప్రతి ఇంట్లోని కథే కదా. కానీ, ఒక్కో సినిమాతో రమేష్ ఎదుగుతున్న తీరును చూసి సంతోషపడింది. కొడుకు పనిచేసిన బలగం చిత్రాన్నితన చుట్టుపక్కల వాళ్లను, స్నేహితులను ఆటోలో తీసుకెళ్లి చూపించి మురిసిపోయింది.
సినిమా అనేది ప్రాంతీయత వైపు అడుగులేస్తున్న ఈ తరుణంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే మరిన్ని కథలను సిద్ధం చేసే పనిలో పడ్డాడు రమేశ్. అయితే దర్శకుడు వేణు, నాగరాజులతో తన ప్రయాణం నిరంతరం కొనసాగుతుందంటున్నాడు . స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చి తన బలాన్ని చాటుకోవాలనే ఆలోచనలో ఉన్న రమేశ్‌కు మనమూ ఆల్ ద బెస్ట్ చెప్పేద్దామా మరి.
ఇవీ చదవండి: