Malakpet Hospital Women Death: ప్రసవానికి సిద్ధమైన మహిళలకు వంద రకాల కోరికలుంటాయి. కాన్పు సుఖంగా జరుగుతుందో లేదోనంటూ వెయ్యిన్కొక్క అనుమానాలుంటాయి. అయినా సరే.. మాతృత్వం కోసం స్త్రీలు ఎముకలు విరిగే నొప్పులనైనా అవలీలగా భరిస్తుంటారు. కత్తిగాట్లను పంటిబిగువున తట్టుకుంటారు. కడుపారా కన్న పసిబిడ్డల బోసినవ్వుల్ని చూస్తే చాలు... తల్లుల కాన్పు కష్టాలన్నీ కరిగిపోతాయి. అప్పుడే పుట్టిన బిడ్డల లేత పాదాల స్పర్శలో తమ భవిష్యత్తును ఊహించుకుని మురిసిపోతుంటారు.
అయితే హైదరాబాద్ లోని మలక్ పేట ఏరియా ఆస్పత్రిలో సీసెక్షన్ చేయించుకున్న ఇద్దరు తల్లుల కలలు మాత్రం కల్లలయ్యాయి. ఈ నెల 11న 13మందికి, 12వ తేదీన 9 మందికి సీ సెక్షన్ చేశారు. అందులో ఇద్దరు మహిళలు రెండు రోజుల్లోనే మృత్యువాత పడ్డారు. దీంతో అప్రమత్తమైన సర్కారు మిగతా వారందరినీ నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరికి కిడ్నీలు దెబ్బతినడంతో డయాలసిస్ చేస్తున్నారు. మిగతా వారిని డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు తెలిపారు. అయితే తల్లుల అకాల మరణానికి ఇన్ ఫెక్షనే కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం. మహిళల రక్త నమూనాల్లో స్టెఫెలో కోకస్ బ్యాక్టిరియా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు.
ప్రసూతి వైద్యంలో ఆపరేషన్ థియేటర్ మొదలుకొని పోస్ట్ ఆపరేటివ్ కేర్ వరకు తల్లులకు ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది. గతేడాది ఆగస్టులో ఇబ్రహీంపట్నంలో జరిగిన ఇలాంటి ఇన్‌ఫెక్షన్ దుర్ఘటన 4 కుటుంబాల్లో చీకట్లు నింపింది. 34 మంది మహిళలకు డీపీఎల్ శస్త్రచికిత్సలు చేయగా 4గురు మృతి చెందారు. అప్పుడు విచారణ చేపట్టగా వారికీ ఇదే తరహా బ్యాక్టిరియల్ ఇన్‌ఫెక్షన్ సోకిట్టు తేలింది. తర్వాత నెల రోజులకు డీఎంహెచ్ఓ సహా ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిపై ప్రభుత్వం వేటేసింది.
ఆ తర్వాత పేట్లబుర్జ్ లోనూ ఇలాంటి ఘటనే పునరావృతమైనా సర్కారు తీరులో మార్పు రాలేదని నిపుణులు పెదవి విరుస్తున్నారు. వరుస ఘటనలకు ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శస్త్రచికిత్స సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లనే ఇన్‌ఫెక్షన్‌కు దారి తీసిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో ఈ నెల13 నుంచి మలక్ పేట ఏరియా ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్లు తాత్కాలికంగా మూసి వేశారు. ఆస్పత్రికి కాన్పుకోసం వచ్చే మహిళలను పేట్ల బుర్జ్, సుల్తాన్ బజార్ ల్లోని మెటర్నిటీ ఆస్పత్రులకు పంపిస్తున్నారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు సర్కారు గొప్పలు చెబుతున్నా... ఇలాంటి దుర్ఘటనలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్లక్ష్యాల్ని బహిర్గతం చేస్త్తూనే ఉన్నాయి. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు హడావుడిగా కమిటీలు వేయడం పరిపాటిగా మారింది. దానికి బదులుగా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ చూడండి..