Malakpet Hospital Women Death Update : బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ల కారణంగానే మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల ఇద్దరు బాలింతలు మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆసుపత్రిలో పరిశుభ్రత లోపమే ప్రధాన కారణమని గుర్తించినట్లు సమాచారం. ఈ ఇద్దరితో పాటు అంతకుముందు సిజేరియన్ చేయించుకున్న మరో 18 మందిని నిమ్స్ అత్యవసర విభాగానికి అప్పటికప్పుడు తరలించారు. ఇందులో ఇద్దరు బాలింతల కిడ్నీలకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో రెండు రోజులుగా డయాలసిస్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం కాస్త ఆందోళకరంగా ఉందని, కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. మరో 9 మందిని సోమవారం డిశ్చార్జి చేయగా.. ఇంకా ఏడుగురు బాలింతలు చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వివరించారు.
ఇదీ జరిగింది..: మలక్‌పేట ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన ఇద్దరు బాలింతలు ఇటీవల మృత్యువాత పడటం.. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే వారు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ నిరసనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లికి చెందిన సిరివెన్నెలను ఇటీవల కాన్పు కోసం మలక్‌పేట ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి కాన్పు చేశారు.
Malakpet area hospital incident : ప్రసవం తర్వాత సిరివెన్నెల తీవ్ర అస్వస్థతకు గురైంది. గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జగదీశ్.. తన భార్య శివానిని కాన్పు కోసం మలక్‌పేట ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాబుకు జన్మనిచ్చిన తర్వాత శివాని ఆరోగ్య పరిస్థితి విషమించింది. గాంధీకి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఒకేసారి ఇద్దరు బాలింతలు మృతి చెందడంతో.. మలక్‌పేట ఆసుపత్రి వద్ద రోదనలు మిన్నంటాయి.
ఆస్పత్రి వద్ద రోదనలు.. ఒక్కరోజు వ్యవధిలో ఇద్దరు బాలింతలు మృతి చెందడంతో.. కుటుంబీకులు, బాధితుల కోపం కట్టలు తెంచుకుంది. వైద్యులు సకాలంలో సేవలందించడంలో నిర్లక్ష్యం చూపడం వల్లే మృతి చెందారంటూ మలక్‌పేట ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. పేదలకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన సర్కార్ దవాఖానాల్లో.. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు.
విచారణకు కమిటీ.. మలక్‌పేట ఆసుపత్రిని స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే బలాల సందర్శించారు. బాధ్యలైన వైద్యులపై చర్యలు తీసుకుంటామన్న ఎమ్మెల్యే సమస్యను ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.ఐదు లక్షలు అందిస్తామని ఆర్డీవో ప్రకటించారు. మలక్‌పేట ఘటనపై దర్యాప్తునకు కమిటీ వేశామని వైద్యశాఖ కమిషనర్ వెల్లడించారు. వైద్యారోగ్యశాఖ నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు గతంలో స్పష్టం చేశారు.
ఇవీ చూడండి..