నీలోఫర్ ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి జూనియర్ డాక్టర్ ప్రత్యుషపై రోగి కుటుంబసభ్యులు దాడికి దిగి... దుర్భాషలాడారు. జూనియర్ డాక్టర్ విధుల నిర్వహణలో భాగంగా రోగులను పరీక్షించేందుకు వార్డులోకి రాగా... ఓ రోగి మంచంపై బ్యాగు ఉండడాన్ని గమనించి తీసి కింద పెట్టారు. దీనిపై చిన్నారి పేషంట్ బంధువు నస్రీన్ జూనియర్ డాక్టర్‌ను అసభ్య పదజాలంతో దూషించి దాడి చేసింది. ఆమె భర్త కూడా వైద్యురాలిపై దుర్బాషలాడాడు. ఇదంతా జరుగుతున్నా సెక్యూరిటీ సిబ్బంది ప్రేక్షక పాత్ర వహించారని డాక్టర్లు ఆరోపించారు. వెంటనే వైద్యురాలు నాంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నస్రీన్, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు.
చికిత్సకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది...
నీలోఫర్ ఆసుపత్రికి రోజూ వందలాది మంది రోగులు చికిత్స కోసం వస్తున్నారు. వీరితో పాటు రోగుల బంధువులు కూడా ఆసుపత్రికి వస్తుండటం వల్ల చికిత్సకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని, అనేక సార్లు రోగులకు అటెండర్స్ సూచించినా పట్టించుకోవడం లేదని వైద్యులు ఆరోపిస్తున్నారు.
ఆస్పత్రి నుంచి పిల్లలను తీసుకెళ్లిన తల్లిదండ్రులు...
ఈ ఘటన జరిగిన సమయం నుంచి దాదాపు రెండు గంటల వ్యవధిలో కొంతమంది తమ పిల్లలకు వైద్యం అందదని భావించి ఆసుపత్రి నుంచి వారిని తీసుకెళ్లారు. ఆసుపత్రిలో అరకొర సౌకర్యాలున్నాయనీ.. దీనికి తోడు వైద్యులపై రోగుల భారం అధికంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయినా తాము నిత్యం రోగులకు వైద్యం అందిస్తున్నామని... కానీ విధి నిర్వహణలో ఉన్న వైద్యులపై దాడులు చేయడం పరిపాటైందని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులపై దాడికి పాల్పడితే ఒకటి నుంచి రెండు, మూడేళ్లు జైలు శిక్ష పడుతుందని దాడులకు పాల్పడే వారు గ్రహించాలని వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి: విద్యుత్ ఒప్పందాలపై సీబీఐ విచారణకు సిద్ధంకండి: లక్ష్మణ్