మత ప్రాతిపదికన దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్)లను తెరపైకి తీసుకువచ్చిందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. వాటికి వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలతో కలిసి దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతం చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 10న హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు.
జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, శ్రేణులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్, దిల్లీలో పలు ప్రాంతాలు, విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న ఘటనలపై అటు భాజపా సర్కార్, ఇటు ప్రధాని నోరు మెదపకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
జేఎన్‌యూలో దాడి క్రూరం
దిల్లీ జేఎన్‌యూలో ఆదివారం రాత్రి విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన దాడి దురదృష్టకరమని ఒవైసీ వ్యాఖ్యానించారు. ‘అది క్రూరమైన, ప్రణాళిక ప్రకారం జరిగిన హింస’’గా అభివర్ణించారు. ‘‘సీఏఏకు వ్యతిరేకంగా నిలవడమే వారు చేసిన పాపమా. దిల్లీలో అర్ధరాత్రి గంటన్నరపాటు హింసాకాండ జరిగినా పోలీసులు నిలువరించలేకపోయారా? ‘జామియా’ ఘటన నుంచి మీరేం పాఠం చేర్చుకున్నారు. దాడికి కారణం మీరంటే మీరేనని ఏబీవీపీ, వామపక్షాలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. మరి అసలు నిజమేమిటో గుర్తించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా?’’ అంటూ సోమవారం ట్విటర్‌లో ప్రశ్నించారు.
ఇవీ చూడండి: 'తుదితీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దు'