హైదరాబాద్ నగర శివార్లలోని కొన్ని పండ్ల తోటలు, ఫామ్‌హౌస్‌లు కోడిపందేలకు కేంద్రంగా మారాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా భారీఎత్తున సొమ్ము చేసుకునేందుకు నిర్వాహకులు ముందస్తు ఏర్పాట్లలో మునిగిపోయారు. పందేలకు అవసరమైన జాతి కోళ్లను ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల నుంచి తీసుకొస్తున్నట్లు సమాచారం.
కోళ్లకు శిక్షణనివ్వడం, పందేలు వేయించడంలో ఆరితేరిన వారిని కూడా నగరానికి రప్పిస్తున్నట్టు సమాచారం. కృష్ణాజిల్లా నుంచి పందెం కోళ్లతో బయల్దేరిన ఒక వ్యక్తిని నల్గొండ జిల్లా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. ఈనెల 12-18 వరకూ నార్సింగి సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఉండేలా నిర్వాహకులు తనతో ఒప్పందం కుదుర్చుకున్నారని నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది.
ఆంక్షలు ఉన్నా..
సంక్రాంతి అంటేనే సరదాల హోరు. వారం పదిరోజుల పాటు జూదశాలలు, పందేలకు పండుగ వాతావరణం. ఆంధ్రప్రదేశ్‌లో పెద్దఎత్తున జరిగే కోడి పందేలకు నగరం నుంచి వేలాది మంది వెళ్తుంటారు. జేబు ఖాళీ అయ్యాక వెనుదిరిగి వస్తుంటారు. అయితే నగరంలోనూ కోడి పందేలు, జూద క్రీడలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. హయత్‌నగర్, ఉప్పల్, భువనగిరి, అల్వాల్, మల్కాజ్‌గిరి, కొంపల్లి, ఏఎస్సాఆర్‌నగర్, పటాన్‌చెరు, నార్సింగి, పహాడీషరీఫ్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే గుట్టుగా పందేలు సాగుతూనే ఉన్నాయి.
కాయ్ రాజా కాయ్..
క్రికెట్ బెట్టింగ్, పేకాట, మట్కా, రమ్మీ, కోడి పందేలు పండుగ సమయాల్లో నిర్వాహకులకు లక్షలు కురిపిస్తుంటాయి. పోలీసులకు అనుమానం రాకుండా నిర్వాహకులు కొన్నిచోట్ల అపార్ట్‌మెంట్స్, వ్యక్తిగత గృహాలను జూదశాలలుగా మార్చేస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో గతేడాది పేకాట, మట్కా నిర్వాహణపై 132 కేసులు నమోదు చేశారు. వీటిలో అధికశాతం మాదాపూర్‌లోని ఐటీ కారిడార్ ప్రాంతంలోనివి కావటం గమనార్హం.
ఈసారి ఏపీకి చెందిన కొందరు వ్యాపారులు, రాజకీయ నేతలు నగరంలోని తమ అనుచరులతో గుట్టుగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పందెం కోళ్లు, కోడికత్తులు తెప్పిస్తున్నారు. పందెపు రాయుళ్లు ఇక్కడే పందేల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు కూడా పలుకుతున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి: పశువులకూ హాస్టళ్లు... పాడిపరిశ్రమ అభివృద్ధికి సోపానాలు