ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత జూన్‌లో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలుకు ఆదిలోనే బ్రేక్ పడింది. ప్రకటిత జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూపు-1, 2లలో 36 ఉద్యోగాల భర్తీకి ఆగస్టులోగా ఏపీపీఏస్సీ నోటిఫికేషన్లను జారీ చేయాల్సి ఉంది. మంగళవారంతో ఈ గడువు ముగుస్తుంది. అయితే.. పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానందున నోటిఫికేషన్లు విడుదలవడం లేదు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితి మినహాయింపు ఉత్తర్వుల గడువు ఈ ఏడాది మే నెలాఖరుతో ముగిసింది. దీని కొనసాగింపు ఉత్తర్వులపై అనిశ్చితి నెలకొంది.
ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉద్యోగాలు భర్తీ కాకుంటే ఓసీలతో నింపే విషయంలో, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితి పెంపుపైనా ఏపీ ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ప్రస్తుత జనరల్ కేటగిరీలో వయోపరిమితి పెంపు జీవో కాలపరిమితి సెప్టెంబరులోగా ముగియనుంది. దీనిపైనా ఉత్తర్వులు రావాల్సి ఉంది. మరోవైపు వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కొందరు నిరుద్యోగులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. ప్రకటించిన ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయని, వాటినీ పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు. దీనిపైనా ప్రభుత్వ స్పందన కనిపించడం లేదు.
సెప్టెంబరు10లోగా ఇస్తాం...
‘నోటిఫికేషన్ల విడుదలకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం నుంచి అవసరమైన ఉత్తర్వులు అందలేదు. సమగ్రంగా అధ్యయనం చేసి ఉత్తర్వులివ్వాల్సి ఉన్నందున జాప్యం అనివార్యమైంది. సెప్టెంబరు పదో తేదీలోగా ఉద్యోగ ప్రకటనలను తప్పకుండా ఇస్తాం’ అని ఏపీపీఏస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు.
ఇదీ చదవండి: NTSE: విద్యార్థులకు మరింత కఠినంగా జాతీయ ప్రతిభ అన్వేషణ పరీక్ష..!