ఈ నెల 30న కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో కొవిడ్ విధుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని... వైద్యారోగ్య సంఘాల ఐక్య వేదిక కోరింది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్(CM KCR)దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని... ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్(Boianapalli Vinod Kumar) ను కలిసి విజ్ఞప్తి చేశారు. హెల్త్ కేర్ వర్కర్స్ కుటుంబాల్లో అందరికీ టీకా వేయాలని, కొవిడ్ విధుల్లో చనిపోయిన వారికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని వేదిక ప్రతినిధులు కోరారు.
వారి కుటుంబాల్లో అర్హులైన ఒకరికి అర్హతకు తగిన ఉద్యోగం నెల రోజుల వ్యవధిలో కల్పించాలని తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బందికి గతంలో ఇచ్చినట్లుగా 10 శాతం కొవిడ్ ఇన్సెంటివ్ ఇవ్వాలని అన్నారు. షిఫ్టుల వారీగా డ్యూటీలు వేసి పని ఒత్తిడి తగ్గించాలని వెల్లడించారు.
2017లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకమైన వైద్య సిబ్బందికి ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొవిడ్, బ్లాక్ ఫంగస్ చికిత్స పొందిన హెల్త్ కేర్ వర్కర్స్కు స్పెషల్ ట్రిట్మెంట్ అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: Kodandaram: 'మిగతా మంత్రులంతా ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు'