‘నా దురదృష్టం ఏమిటంటే నా నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉంది. అర కిలోమీటరు దూరంలో ఉన్న అక్కడి నుంచి మద్యం తెచ్చుకుని తాగుతారు. మద్యం ఏరులై పారుతోంది అంటే నేనేం చేయాలి? అదే పనిగా కాచుకుని ఉంటామా! ’అని ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. బుధవారం ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు.
ఇసుక ట్రాక్టర్లు వదలాలని ఎస్సైని బెదిరించారని మీపై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారా? అని విలేకరులు అడగ్గా.. మంత్రి జయరాం స్పందిస్తూ ఈ విషయం సీఎంకు తెలియదన్నారు. ‘దందాగిరి చేసేందుకు నేనేం వీరప్పన్‌లా ఏనుగు దంతాలు, గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేశానా? మట్టి తోలుకున్నాక తిరిగొస్తున్న ఖాళీ ట్రాక్టర్లను ఎస్సై ఆపితే అవి రైతులవి వదిలేయమని చెప్పిన మాట వాస్తవమే. నేను ఎక్కడైనా ఏయ్ ఎస్సై! ఇసుక ట్రాక్టర్లను వదలండి అని చెప్పి ఉంటే నాది తప్పు అవుతుంది. అడ్డదారిన మంత్రి అయిన లోకేశ్ నాపై విమర్శలు చేస్తున్నారు. ట్వీట్‌లు కాదు ధైర్యం ఉంటే బహిరంగంగా ఆయన చర్చకు వస్తే నేనూ మాట్లాడతా...’ అని మంత్రి జయరాం సవాల్ చేశారు.
మంత్రిగా మీపై వచ్చిన ఆరోపణలను సీఎం దృష్టికి తీసుకువెళ్లలేదా అని అడగ్గా..‘అది పెద్ద సమస్యే కాదు. మా శాఖకు సంబంధించిన పనులు, మా వద్ద కష్టపడిన కార్యకర్తలకు పోస్టు కోసం మాట్లాడాను...’ అని ఆయన సమాధానమిచ్చారు.
ఇదీ చదవండి: ఏపీ: మంత్రి జయరాం స్వగ్రామంలో పోలీసులపై దాడి