AP High Court Orders to KS Jawahar: కోర్టు ధిక్కరణ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ హాజరుకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు బుధవారం ఈ మేరకు నోటీసు జారీ చేశారు. నియామక తేదీ నుంచి తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోరుతూ అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఒప్పంద అధ్యాపకురాలు దాసరి ఉమాదేవి, మరో 114 మంది హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
శాశ్వత అధ్యాపకులకు మాదిరి ఆర్థిక ప్రయోజనాలను కల్పించాలని, ఎయిడెడ్ అధ్యాపకులను తాము పని చేసే కళాశాలలో విలీనం చేసుకున్నా సీనియారిటీకి అవరోధం కల్పించొద్దని, తమ స్థానాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.రాజశేఖరరావు గతేడాది సెప్టెంబరు 26న విచారణ జరిపారు.
ప్రభుత్వ న్యాయవాది (జీపీ సర్వీసెస్-3) విచారణకు హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అప్పటికే మూడు సార్లు వాయిదా పడిందని గుర్తు చేశారు. పిటిషనర్లు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో ఉమాదేవి హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, సీఎస్ జవహర్‌రెడ్డి, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ శేషగిరిబాబులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
బుధవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది. న్యాయస్థానం ఇచ్చిన నోటీసులు అందుకున్నప్పటికీ ప్రవీణ్ ప్రకాష్, జవహర్‌రెడ్డి తరఫున ఎవరూ హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి వారికి నోటీసు జారీ చేశారు.
ఇవీ చదవండి: