AP Govt Employees Association: ఏపీ ప్రభుత్వంపై.. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆ రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. తమకు సకాలంలో జీతాలతోపాటు.. తాము దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వడం లేదని ఏపీజీఈఏ అధ్యక్షుడు కె.ఆర్. సూర్యనారాయణ నేతృత్వంలో గర్నర్‌కు కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఇతర ఉద్యోగ సంఘాల తీరుపైనా సూర్యనారాయణ మండిపడ్డారు. సమస్యలపై పోరాడే అవకాశం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. తమకు దక్కాల్సిన ప్రయోజనాల కోసం ఏప్రిల్ నుంచి ఉద్యమిస్తామని ప్రకటించారు.
ప్రతినెల సకాలంలో వేతనాలు అందక, ఇతర ఆర్థిక ప్రయోజనాలూ దక్కక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు కష్టాలు పడుతున్నారంటూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. సంఘాల నేతలు సూర్యనారాయణ, ఆస్కారరావుతో పాటు మరో ఆరుగురు నేతలు విజయవాడలోని రాజ్‌భవన్‌లో.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు. గవర్నర్‌తో భేటీ తర్వాత మాట్లాడిన సూర్యనారాయణ...ప్రభుత్వ ఉద్యోగులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని చెప్పారు. 90 వేలమంది ప్రభుత్వ ఉద్యోగుల అనుమతి లేకుండా వారి ఖాతాల నుంచి ప్రభుత్వం డబ్బులు తీసుకుందని, ఇదేమని అడిగితే తిరిగి ఇస్తామని చెపుతున్నారు తప్ప ఇవ్వడం లేదని వాపోయారు. తప్పని పరిస్థితుల్లో గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన చేపడతామని సూర్యనారాయణ స్పష్టం చేశారు. కలిసిరాని ఉద్యోగ సంఘాలు చరిత్రహీనులుగా మిగిలిపోతాయని హెచ్చరించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని ఏపీజీఈఏ నేతలు తెల్చిచెప్పారు. జీతభత్యాలు, ఆర్ధిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వమే నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నందున ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
'ఉద్యోగుల జీత భత్యాలు, ఆర్ధిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం తన నిబంధనల్ని తానే ఉల్లంఘిస్తోంది. అందుకోసమే ఓ ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగుల జీతాలను ఆలస్యం చేస్తున్నారు. తమ విజ్ఞప్తులను పెడచెవిన పెడుతున్నారు. అందుకనే రాష్ట్రగవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశాం. చట్టం చేయాల్సిన అవసరం ఉందని గతంలో ఎవ్వరూ ఆలోచించలేదు. గత కొంత కాలంగా మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే చట్టం చేయాల్సిన అవసరం ఉందనే చెప్పాలి. చట్టం ఉంటే న్యాయంగా తమకు వచ్చే జీతాలు, ప్రయోజనాలు ఇచ్చేవారు. మంత్రులు, అధికారులకు, ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది... ఇలా అందరినీ కలిశాం. అయినా ఇప్పటివరకు స్పందించకపోవడంతో గవర్నర్‌ను కలవడానికి వచ్చాం. ఉద్యోగులకు వివిధ రూపాల్లో వచ్చే అర్థిక లబ్ధికి సంబందించిన సమాచార హక్కు చట్టం ద్వారా అర్జీ పెట్టుకుంటే సమాచారం ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే... రోడ్డు మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తాం.'- సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు
ఇవీ చదవండి: