ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు నియోజకవర్గాలనే కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని 2019 ఆగస్టులో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాతిపదికన 25 నుంచి 26 జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే జిల్లాల పునర్విభజనకు సంబంధించి పాలనాపరమైన అంశాల్లో భాగంగా సిబ్బంది పంపకం, కేటాయింపు, బాధ్యతల పరిధి తదితర విషయాలు క్లిష్టతరంగా మారినట్టు తెలుస్తోంది. ఇక భౌగోళికంగా జిల్లాల విభజన విషయంలోనూ సరిహద్దుల వివాదాలపై రాష్ట్రస్థాయి, ఉప సంఘాలు, జిల్లా కమిటీల్లో తీవ్రంగా చర్చ జరిగినట్టు సమాచారం.
కొన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఇతర జిల్లాలకు సంబంధించిన అసెంబ్లీ నియోజవర్గాలు ఉండటం వంటి అంశాలు ఇబ్బందికరంగా పరిణమిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆదాయ పరంగానూ కొన్ని అంశాలు కమిటీలకు తలనొప్పిగా మారాయి. గనులు, ఆదాయార్జన వనరులు ఉన్న ప్రాంతాలు, అవి లేని ప్రాంతాల మధ్య ఆర్థిక అంశాలు పెద్ద వివాదంగా మారే అవకాశముందని సమాచారం. ఈ అంశాలను రాజకీయ నిర్ణయానికే వదిలేయాలని రాష్ట్ర స్థాయి కమిటీ చర్చించినట్టు తెలుస్తోంది.
మరోవైపు క్షేత్రస్థాయిలోని జిల్లా కమిటీలు, ప్రాంతీయ కమిటీలు కొత్త జిల్లాలు ఏర్పాటైతే అవసరమైన మౌలిక సదుపాయాల గురించి ప్రతిపాదనలు పంపించినట్టు తెలుస్తోంది. సొంత భవనాలు, అద్దె భవనాలు వివరాలను సేకరించారు. జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అంశంపై ఇప్పటికే నివేదికలు రాష్ట్రస్థాయి కమిటీకి పంపించారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా పోలీసు శాఖకు సంబంధించి కూడా 29 యూనిట్లు ఏర్పాటు అయ్యే అవకాశముంది. ఇప్పటికే ఉన్న రెండు పోలీసు కమిషనరేట్లకు అదనంగా మరో ఐదు చోట్ల కమిషనరేట్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి : పెద్దల సభకు వెళ్తున్న ఈ ముగ్గురి నేపథ్యం తెలుసా...?