పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్(Gandhi bhavan) లో రేవంత్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తు నిపుణుల సూచనల మేరకు గాంధీ భవన్లో పలు మార్పులు చేశారు. ఇప్పటికే భవనానికి రంగులు వేశారు. ఫ్లోరింగ్ వేయటంతో చెట్లను ట్రిమ్ చేశారు. ఈ మార్పులతో గాంధీ భవన్ కొత్తగా కనిపస్తోంది. మరోవైపు తన బాధ్యతల స్వీకారానికి రావాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు. కర్ణాటక వెళ్లి రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య, అక్కడి పీసీసీ అధ్యక్షుడు డి.కే శివకుమార్ ఆహ్వానించారు.
ఉదయం నుంచే కార్యక్రమాలు
బుధవారం ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి గుడిలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11 గంటలకు నాంపల్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి గాంధీ భవన్‌కు ర్యాలీగా బయల్దేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాలకు రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయనతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, పలు విభాగాల ఛైర్మన్లు, సీనియర్ ఉపాధ్యక్షులు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. బాధ్యతల స్వీకరణ అనంతరం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొంటారు.
పార్టీ పెద్దలతో భేటీ
బాధ్యతల స్వీకరించేలోపు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పార్టీ సీనియర్లను కలిసే పనిలో పడ్డారు. ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీహెచ్‌ను కలిసి ఆయన యోగాక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దామోదర రాజనరసింహ, రేణుకా చౌదరి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, నాగం జనార్దన్ రెడ్డి, కొండా సురేఖ, ఏఐసీసీ సభ్యులు కుసుమ కుమార్‌ను కలిశారు. ఇవాళ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. రేపటి పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం మర్రి శశిధర్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబును కూడా కలిశారు.
భారీగా ఏర్పాట్లు
మరోవైపు నూతన పీసీసీ అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గాంధీ భవన్ ప్రాంగణంలో, వెలుపల రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి జిల్లాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: KTR: రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలి