‘అమెరికన్ గ్యాస్ట్రోస్కోపిక్ క్లబ్’ వ్యవస్థాపకులు, ‘ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రోస్కోపీ’గా గౌరవించే డాక్టర్ రుడాల్ఫ్ వి.షిండ్లర్ పేరిట జీర్ణకోశ వ్యాధుల చికిత్సల్లో విశిష్ఠ సేవలందించిన వైద్యనిపుణులకు ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తారు. 2021 సంవత్సరానికి డాక్టర్ డీఎన్ రెడ్డికి ఈ గౌరవం దక్కింది. ఈ పురస్కారానికి ఎంపికైన తొలి భారతీయ వైద్యుడు ఆయనే. ఆదివారం రాత్రి జరిగిన ఆన్‌లైన్ సదస్సులో ఏఎస్‌జీఈ అధ్యక్షులు డాక్టర్ క్లాస్ మెర్జెనర్ ఈ పురస్కారాన్ని డాక్టర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా క్లాస్ మెర్జెనర్ మాట్లాడుతూ.. ఎండోస్కోపీ విధానంలో అందిస్తున్న అధునాతన వైద్యసేవలు, దీర్ఘకాల పరిశోధన, సునిశిత బోధన, అంతర్జాతీయ భాగస్వామ్యం, మార్గదర్శకునిగా నిలిచినందుకు గుర్తింపుగా ఈ అవార్డుకు డాక్టర్ రెడ్డిని ఎంపిక చేసినట్లుగా తెలిపారు. ఆయన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎండోస్కోపీ చికిత్సల్లో విప్లవాత్మక మార్పులను సృష్టించారని, ప్రపంచ దేశాల్లోనూ ఈ చికిత్స విధానాలను ప్రోత్సహించడంలో, అవగాహన కల్పించడంలో ముందువరుసలో నిలిచారని తెలిపారు.
నాణ్యమైన వైద్యమందించడమే లక్ష్యం
ఈ పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం డాక్టర్ రెడ్డి ప్రసంగిస్తూ.. ‘‘ఈ అవార్డు పొందడం జీర్ణకోశ వైద్యనిపుణులకు ఒక కల. ఏఎస్‌జీఈ అంతర్జాతీయ సభ్యుడిగా ఉన్న నేను ఇప్పుడీ అత్యున్నత పురస్కారాన్ని పొందడం అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ షిండ్లర్ జీర్ణకోశ ఎండోస్కోపీ చికిత్సల్లో నాణ్యత ప్రమాణాలను పాటించడంలో ఒక మైలురాయిని నెలకొల్పారు. ఏ రంగంలోనైనా చిత్తశుద్ధి, పట్టుదల, అంకితభావంతో కష్టపడితే.. ఏ దేశంలో సేవలందిస్తున్నామనే దానితో పనిలేకుండా గుర్తింపు దానంతటదే లభిస్తుందనడానికి నాకు లభించిన ఈ అవార్డే ఒక ఉదాహరణ. ఈ గౌరవం నా బాధ్యతలను మరింత పెంచింది. నాణ్యమైన ఎండోస్కోపీ చికిత్సలను అందరికీ చేరువ చేయడం, ఈ అంశంపై విద్యాబోధనను మరింత విస్తృతం చేయడంలో పునరంకితమవుతాను. నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ధరలో అందించాలనే లక్ష్యం దిశగా నిరంతరం కృషిచేస్తూనే ఉంటాను’’ అని వెల్లడించారు.
-డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి, ఛైర్మన్, ఏఐజీ
అంతర్జాతీయ ఖ్యాతి
నాగేశ్వరరెడ్డి కర్నూలులో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ఛండీగఢ్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీలో పీజీ పూర్తిచేశారు. హైదరాబాద్‌లో ఏఐజీ స్థాపించి ప్రపంచ ప్రఖ్యాత జీర్ణకోశ వైద్య నిపుణులుగా ఎదిగారు. ప్రపంచ దేశాల్లో ఎండోస్కోపీ చికిత్సలపై వందలాది ఉపన్యాసాలిచ్చారు. 700కి పైగా వైద్యపత్రాలను సమర్పించి, 50కి పైగా వైద్యపత్రికలను సమీక్షించారు. భారత ప్రభుత్వం డాక్టర్ రెడ్డిని ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. తాజాగా రుడాల్ఫ్ వి. షిండ్లర్ అవార్డును దక్కించుకుని మరోసారి అంతర్జాతీయంగా ఖ్యాతి గడించారు.
ఇదీ చూడండి: 'ఆయుష్ మార్గదర్శకాలకు అనుగుణంగా కొవిడ్ చికిత్స'