గ్రేటర్ హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా, టిమ్స్‌తో పాటు పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స అందిస్తున్నారు. అనేక మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వైద్య చికిత్సలతో పాటు అత్యవసర సమయాల్లో కొవిడ్ బాధితులను మెరుగైన వైద్యం కోసం వాహనాల్లో తిప్పాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కొందరికి సీటీ స్కాన్‌తో పాటు ఇతర పరీక్షల కోసం తరలిస్తుంటారు. వాటిని అవకాశంగా మలచుకుంటున్నారు అంబులెన్స్‌నిర్వాహకులు.
విషమమంటే చాలు వాయించటమే...
ఆస్పత్రుల వద్ద తిష్ఠవేసి అందినకాడికి దండుకుంటున్నారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాధితులపైనా ఏమాత్రం కనికరం చూపట్లేదు. రోగిప్రాణాల మీదకొచ్చిందంటే చాలు భారీగా వసూలు చేస్తున్నారు. ఒకరిని కాదని ఇంకొకర్ని అడిగినా పరిస్థితిలో మార్పులేదని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. గతంలో సీటీ స్కాన్ ఇతర అవసరాల కోసం వెళ్లాలంటే 15 వందల నుంచి 2వేలు తీసుకునేవారు. ప్రస్తుతం నాలుగు నుంచి ఐదు వేల పైన ఇస్తేనే అంబులెన్స్ కదులుతోంది. పీపీఈ కిట్ పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారని రోగుల బంధువులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
చికిత్సకయ్యే ఖర్చుకు ఏమాత్రం తగ్గట్లేదు...
గ్రేటర్ పరిధిలో సుమారు 500ల వరకు ప్రైవేట్ చిన్న, పెద్దఅంబులెన్స్‌లు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోని ఆసుపత్రుల నుంచి జిల్లా కేంద్రాలకు రోగులను, మృతదేహాలను తరలించాలంటే వేలల్లో వసూలు చేస్తున్నారు. 150 కిలోమీటర్ల నుంచి 175 కిలోమీటర్ల వరకు 8 నుంచి 10వేలు గుంజుతున్నారు. అధికారుల అనుమతితో పొలాలు, పెరట్లో ఖననం చేసేందుకు తీసుకెళ్తే... ఏకంగా 25 నుంచి 30 వేల వరకు లాగుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల చికిత్సకు ఏమాత్రం తక్కువకాకుండా అంబులెన్స్ నిర్వాహకులు దోపిడీ చేస్తున్నారని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. కిరాయి చెల్లించలేని వాళ్లు.. ఆటోలు, ట్రాలీ ఆటోల్లో తీసుకెళ్తున్నారు.
అత్యవసర సమయాల్లో అంబులెన్స్ వైపు చూసేవాళ్లు.. ఆ వాహనం చూస్తేనే బెంబేలెత్తుతున్నారు. ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నా... పోయిన ప్రాణాన్ని తరలించాలన్నా చెలగాటమాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి ధరలను నియంత్రించాలని బాధితులు వేడుకుంటున్నారు.