ఏడాదికి పైగా.. అమరావతి పరిరక్షణ ఆందోళన చేస్తున్న రాజధాని గ్రామాల రైతులు, మహిళలు.. సంక్రాంతి రోజూ తమ పోరాటాన్ని ఆపలేదు. పండగ వేడుకలను సైతం.. ఆందోళనలో భాగం చేశారు. తమ ఆకాంక్షలను మరింత బలంగా చాటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తమను మోసం చేస్తున్నాయని రాజధాని రైతులు ఆరోపించారు. పరిపాలన వికేంద్రీకరణను నిరసిస్తూ.. 394వ రోజూ ఆందోళనలు చేపట్టారు.
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. ఏపీ ఉద్ధండరాయునిపాలెంలో గ్రామ దేవతకు పొంగళ్లు సమర్పించారు. అనంతవరంలో చిన్నారులు హరిదాసు వేషం వేసి.. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. 2019 డిసెంబరు నుంచి అన్ని పండుగలు దీక్షా శిబిరాల్లో చేసుకోవడం తమకు అలవాటైపోయిందని చెప్పారు.
గుంటూరు జిల్లాలోని వెలగపూడి, తుళ్లూరు, మందడం, అనంతవరం, వెంకటపాలెం, ఉద్ధండరాయునిపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెంలో రైతులు, మహిళలు ఆందోళనలు నిర్వహించారు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం నిరసన చేపట్టిన అన్నదాతలను కేంద్రం చర్చలకు పిలిచనట్లు.. తమతో మాట్లాడేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావాలని రైతులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : కాఫీలు తాగారా.. టిఫినీలు చేశారా..!