న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఐదో రోజుకు చేరుకుంది. ఏపీ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం నుంచి ఇవాళ్టి పాదయాత్ర ప్రారంభమైంది. వెంకటేశ్వరస్వామి విగ్రహానికి ప్రత్యేక పూజాలు నిర్వహించి రైతులు ముందుకు కదిలారు.
ఈరోజు పెదనందిపాడు వరకు చేపడుతున్న పాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని భగవంతుడిని రైతులు వేడుకున్నారు. పెదనందిపాడు వరకు 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. అమరావతి రాజధానిగా ఉండాలని పోరాడుతున్న రైతులకు ఎక్కడిక్కడ విశేష స్పందన లభిస్తోంది. గురువారం తిక్కిరెడ్డి పాలెం గ్రామస్థులు రైతులకు వసతి, ఆహార ఏర్పాట్లు చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరిట ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని వారు కోరుతున్నారు.
కాడెద్దులతో ఆహ్వానం..
రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు ఎక్కడికక్కడ అన్నదాతలు మద్దతు తెలుపుతున్నారు. గుంటూరు జిల్లా పత్తిపాడులో స్థానిక రైతులు కాడెద్దులతో పాదయాత్రకు ఆహ్వానం పలికారు. రైతులు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు తెలిపారు.
విద్యార్థులు సైతం..
రాజధాని రైతుల పాదయాత్రకు పాఠశాల విద్యార్థులు సైతం మద్దతు తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో రైతులు పాదయాత్ర చేస్తున్న మార్గంలో విద్యార్థులు కలిశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. తాము కూడా రైతు బిడ్డలమేనని.. అందుకే పాదయాత్రకు మద్దతిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: Letter to CJI: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు విద్యార్థిని లేఖ.. ఎందుకంటే?