Amararaja Batteries Company to Telangana: చూశారుగా.. ఏపీలో ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఓ మంత్రి, సలహాదారు వ్యాఖ్యలు. ఒక భారీ పరిశ్రమ రాష్ట్రం నుంచి వెళ్లిపోతోందంటే దాన్ని ఆపేందుకు ప్రయత్నించాల్సిన కీలక స్థానాల్లోని వ్యక్తులే ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారో.. పరిశ్రమ నిబంధల ప్రకారం నడుచుకునేలా చూడటం ప్రభుత్వ బాధ్యతే.. ఒకవేళ అలా నడుచుకోకుంటే లోపాలు సరిదిద్దుకునేందుకు అవకాశం ఇవ్వాలి కానీ.. ఏకంగా బయటకు పంపేలే వేధించడం ప్రభుత్వ కక్ష సాధింపే.
వైసీపీ ప్రభుత్వ వేధింపులతో ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోయే పరంపర కొనసాగుతోంది. తాజాగా అమరరాజా బ్యాటరీస్ నూతనంగా చేపట్టనున్న విస్తరణ తెలంగాణకు తరలివచ్చింది. పరిశ్రమలు పెడతామని ఎవరైనా ముందుకొస్తే ప్రభుత్వాలు వారికి ఎర్ర తివాచీలతో స్వాగతం పలుకుతాయి. కానీ వైసీపీ ప్రభుత్వం తీరే వేరు.. కొత్త పరిశ్రమల్ని ఆహ్వానించడం మాట అటుంచితే.. ఉన్నవాటినే తన్ని తరిమేస్తోంది. ఇక గత ప్రభుత్వం హయాంలో వచ్చిన సంస్థలతో పాటు.. ప్రత్యర్థి పార్టీకి చెందిన వారి సంస్థలైతే కక్షసాధింపు చర్యలు రెట్టింపవుతాయి.
కేవలం తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ సంస్థ అన్న ఏకైక కారణంతో.. రాజకీయ కక్ష సాధింపుతో అమరరాజా సంస్థపై జగన్ ప్రభుత్వం తీవ్రమైన వేధింపులకు పాల్పడింది. దీంతో చిత్తూరు జిల్లాలో ఆ సంస్థ విస్తరణ పనులు విరమించుకుంది. ఒకానొక దశలో తమిళనాడుకు తరలిపోవాలనుకున్నా.. అమరరాజా సంస్థ ఆలోచన గురించి తెలిసిన తెలంగాణ ప్రభుత్వం.. వారికి సాదర స్వాగతం పలికింది. పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇవ్వడంతో అత్యాధునిక లిథియం అయాన్ బ్యాటరీల పరిశోధన, తయారీ యూనిట్‌ను తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు అమరరాజా సంస్థ అంగీకరించింది. వచ్చే పదేళ్లలో రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. దేశంలో బ్యాటరీల తయారీ రంగంలో అమరరాజా ప్రముఖ స్థానంలో ఉంది. అలాంటి సంస్థ ఏకంగా రూ.9,500 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటుకు ముందుకొస్తే.. వెంటాడి వేధించి తరిమికొట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది.
అమరరాజా తరలిపోవడం వల్ల వారికి వచ్చే నష్టమేమీ లేదు.. ఎందుకంటే రూ.వేల కోట్లు పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలకు ఎక్కడైనా అదే పెట్టుబడి పెడతారు. వారికి కావాల్సిందల్లా అవసరమైన వనరులు, వసతులు, సానుకూలంగా స్పందించే ప్రభుత్వం అంతే. వారిని వెళ్లగొట్టే వరకు నిద్రపోని మంత్రులు, వైసీపీ పెద్దలకు వచ్చిన నష్టమూ ఏమీ లేదు.. కానీ నష్టపోయిందంతా రాష్ట్రమే. వెనుకబడిన రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో అమరరాజా ఫ్యాక్టరీతో ఇప్పటికే 20 వేల మంది ప్రత్యక్షంగా, 50 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.
ఆ సంస్థ మరో రూ.9,500 కోట్ల పెట్టుబడితో లిథియం అయాన్ బ్యాటరీల తయారీ పరిశ్రమను ఇక్కడే ఏర్పాటు చేసి ఉంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా మరికొన్ని వేల మందికి ఉపాధి దొరికేది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం వచ్చేది. పలు అనుబంధ పరిశ్రమలూ వచ్చేవి. పైగా రాబోయే కాలమంతా లిథియం అయాన్ బ్యాటరీలదే హవా. ఆ రంగంలో రాష్ట్రం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయేది.
పెద్దఎత్తున విస్తరణ చేపడుతున్న అమరరాజా సంస్థ.. తెలంగాణతో పాటు తమిళనాడు, ఉత్తరభారత్‌లోని మరో రాష్ట్రంలోనూ పెట్టుబడులు పెట్టాలని చూస్తోంది. బ్యాటరీల తయారీలో నెంబర్‌వన్ స్థానంలో ఉన్న అమరరాజా సంస్థను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తమ రాష్ట్రానికి ఆహ్వానించారు. దీంతో అక్కడ కూడా పెట్టుబడులు పెట్టాలని అమరరాజా సంస్థ ఆలోచిస్తోంది.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే అమరరాజా సంస్థపై వేధింపులు ప్రారంభమయ్యాయి. ఆ సంస్థకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన 253 ఎకరాల భూముల్ని 2020 జూన్ 30న ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది. భూములు తీసుకుని పదేళ్లవుతున్నా.. ఒప్పందం ప్రకారం వినియోగంలోకి తీసుకురాలేదంటూ వెనక్కి తీసుకుంది.
దీనిపై ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఒప్పందంలో పేర్కొన్న దానికన్నా ఎక్కువ మందికి ఉపాధి కల్పించడమే గాక.. రూ.2,700 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టామని చెప్పడంతో కోర్టు స్టే విధించింది. ఆ తర్వాత ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు మరింత ఎక్కువయ్యాయి. 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో విడతల వారీగా అమరరాజా బ్యాటరీ కంపెనీల్లో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ గాలిలో, మట్టిలో సీసం పరిమాణం నిర్దేశిత ప్రమాణాలకు మించి ఉన్నట్టు తమ అధ్యయనంలో వెల్లడైందని పీసీబీ తెలిపింది.
ఉద్యోగుల రక్తంలోనూ నిర్దేశిత పరిమితికి మంచి సీసం ఉన్నట్టు పరీక్షల్లో తేలిందని చెప్పింది. నిబంధనలు పాటించడం లేదంటూ చిత్తూరు జిల్లా నూనెగుండ్లపల్లి, కరకంబాడిల్లో ఉన్న అమరరాజా బ్యాటరీ తయారీ యూనిట్లు మూసేయాలని ఆదేశించింది. 2021 మే 1న అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమకు ప్రభుత్వం ఏకంగా విద్యుత్ సరఫరా నిలిపివేసింది.
ప్రభుత్వ ఉత్తర్వులపై అమరరాజా సంస్థ హైకోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వాత కూడా వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నిబంధనల సాకుతో విపక్ష పార్టీల్లో కీలక నేతలకు చెందిన పరిశ్రమలపై కక్షసాధింపునకు పాల్పడటం, ఏకంగా వాటిని మూసివేయించాలని చూడటం వల్ల వాటిలో పనిచేస్తున్న వేలమంది కార్మికులు, రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది.
ఇవీ చదవండి:
తెలంగాణకు వచ్చిన మరో భారీ పెట్టుబడి 'అమర్‌రాజా': కేటీఆర్
ఇగ్లూ థియేటర్.. ఇందులో సినిమా చూశారంటే థ్రిల్ అవ్వాల్సిందే!