Allocations for IT and Industry in TS Budget 2023: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను హరీశ్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. మూలధన వ్యవయం రూ.2,11,685 కోట్లు.. పెట్టుబడి వ్యయం రూ. 37, 525 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
పరిశ్రమల శాఖకు ఈ బడ్జెట్లో రూ.4,037 కోట్లు: 2022-23 సంవత్సరానికి పరిశ్రమల శాఖకు ఈ బడ్జెట్లో 4వేల 37కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. తెలంగాణలో శాంతిభద్రతల నిర్వహణ సమర్థవంతంగా ఉండబట్టే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతోందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే రాష్ట్రంలో మెరుగైన శాంతిభద్రతల నిర్వహణ ఒక కారణమన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన దగ్గర్నుంచీ ఎనిమిదిన్నరేండ్లలో ఐటీ వార్షిక ఎగుమతుల విలువ భారీగా పెరిగిందని బడ్జెట్‌లో మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఐటీ ఉద్యోగ నియామకాల్లో కూడా వృద్ధి సాధించామన్నారు. ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు సైతం విస్తరిస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ చట్టం విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చిందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటివరకు 22,110 పరిశ్రమలకు అనుమతులు లభించాయన్నారు. ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. మొత్తం 21 వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రావడం గర్వించదగ్గ విషయమన్న హరీశ్... రాష్ట్రానికి ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చేందుకు కృషి చేసిన పరిశ్రమల శాఖకు అభినందనలు తెలియజేశారు.
'ఐటీ ఉద్యోగాల నియామకాల్లో కూడా 156 శాతం వృద్ధి ఉండటం విశేషం. 2014 నాటికి తెలంగాణలో 3,23,396 మంది ఐటీ ఉద్యోగాల్లో ఉండగా ఇప్పుడు వీరి సంఖ్య 8,27,124 కి పెరిగింది. దేశవ్యాప్తంగా 2021-22 లో 4.50 లక్షల ఐటీ ఉద్యోగాలు రాగా అందులో ఒక్క తెలంగాణలోనే 1,49,506 ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఐటీ ఎగుమతుల్లో 2021-22 సంవత్సరానికి గాను 26.14 శాతం వృద్ధితో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకున్నది. ప్రపంచంలోనే టాప్ 5 టెక్నాలజీ కంపెనీలైన యాపిల్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ సంస్థలు తమ కేంద్ర కార్యాలయాలకు వెలుపల అతి పెద్ద ఆఫీసులను హైదరాబాద్ లోనే నెలకొల్పటం విశేషం. ఇందులో 4 తెలంగాణ ఆవిర్భావం తరువాత వచ్చినవే.'-హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి
టీ హబ్ : వినూత్న ఆవిష్కరణలతో ముందుకు వచ్చే ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నామన్న ప్రభుత్వం... స్టార్టప్‌ల ఆవిష్కరణల్లో దేశంలోనే టీహబ్ రికార్డు సృష్టించినట్లు తెలిపింది. భారీ పారిశ్రామిక వాడల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయన్న ప్రభుత్వం... ఐదేళ్లకు సంబంధించి పారిశ్రామిక వాడల లక్ష్యాన్ని వెల్లడించింది.
'తెలంగాణలో ఫార్మాసిటీ, నిమ్జ్, కాకతీయ మెగాటెక్స్ టైల్స్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తి క్లస్టర్లు వంటి అనేక భారీ పారిశ్రామిక వాడల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఐదేండ్లలో 70 కొత్త పారిశ్రామిక వాడలను టీఎస్ఐఐసీ ద్వారా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్నది. సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమలకు సంబంధించి దండుమల్కాపూర్‌లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును 570 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 400 ఎంఎస్ఎంఈలు 1200 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఈ పరిశ్రమల్లో 15 వేల మందికి ఉపాధి లభించింది.'-హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి
ఆహార పరిశ్రమలను ప్రోత్సహించడానికి హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో 7,150 ఎకరాల విస్తీర్ణంలో 21 కొత్త స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని హరీశ్‌రావు తెలిపారు. ఈ జోన్లకు అవసరమైన అప్రోచ్ రోడ్లు, అంతర్గత రోడ్లు, విద్యుత్తు, నీటి సౌకర్యాలతో పాటు గోదాములు, కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేస్తుందన్నారు. పరిశ్రమల శాఖకు ఈ బడ్జెట్లో రూ.4,037 కోట్లు ప్రతిపాదించడమైందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.
ఇవీ చదవండి: