గతేడాది(2020) వానాకాలం సీజన్‌కు 10 లక్షల టన్నుల యూరియా కేటాయించగా ఈ ఏడాది వానాకాలంలోనూ అంతకన్నా మరో 50 వేల టన్నులు పెంచారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఇటీవల యూరియా ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక్కడి నుంచి తొలి ప్రాధాన్యంగా తెలంగాణకే కేటాయిస్తామని కేంద్ర ఎరువుల శాఖ తెలిపింది. మొత్తం 10.50 లక్షల టన్నుల్లో లక్ష టన్నుల యూరియా రామగుండంతో పాటు ఇతర కర్మాగారాల నుంచి గత నెలలో రావాల్సి ఉండగా 71 వేల టన్నులే వచ్చింది. గత కోటాలో మిగిలిన 29 వేల టన్నులను.. మే నెల కోటా లక్షన్నర టన్నులతో కలిపి పంపాలని కేంద్రాన్ని వ్యవసాయశాఖ కోరింది.
సగటుకన్నా అధికం
జాతీయ సగటు ప్రకారం దేశవ్యాప్తంగా ఎకరానికి 51.2 కిలోల రసాయన ఎరువులు వాడుతుంటే తెలంగాణలో 185 కిలోలు వినియోగిస్తున్నారు. ప్రపంచ సగటు వినియోగం 78.4 కిలోలు. 208 మండలాల వ్యవసాయ భూముల్లో భాస్వరం(డీఏపీ) మోతాదుకన్నా ఎక్కువగా ఉన్నట్లు భూసార పరీక్షల్లో గుర్తించారు. అంటే డీఏపీ అదనంగా వాడాల్సిన అవసరమే లేదు. కానీ ఈ సీజన్‌లో మరో లక్ష టన్నులు డీఏపీ అదనంగా పెంచి సరఫరా చేయాలని నిర్ణయించడం గమనార్హం. ఈ వేసవిలో మట్టి నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో భూసార పరీక్షలు చేయిస్తే రసాయన ఎరువుల వాడకం 30 నుంచి 40 శాతం తగ్గించవచ్చని జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ప్రధాన శాస్త్రవేత్త ఒకరు చెప్పారు.
రైతులకు అవగాహన కల్పిస్తాం
రాష్ట్రంలో రసాయన ఎరువుల వాడకం చాలా ఎక్కువగా ఉన్నట్లు వ్యవసాయశాఖ పరిశీలనలో గుర్తించాం. రైతులకు అవగాహన కల్పించి వీటి వాడకాన్ని నియంత్రించాలని జిల్లాల వ్యవసాయాధికారులకు సూచించాం. సాగునీటి లభ్యత కారణంగా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందని.. కేంద్రానికి తెలియజేసి, 25.50 లక్షల టన్నుల సరఫరాకు ఆమోదం పొందాం.
-బి.జనార్దన్‌రెడ్డి, కమిషనర్, ముఖ్యకార్యదర్శి వ్యవసాయశాఖ
ఇదీ చూడండి: మహబూబ్‌నగర్ జిల్లాలో మినీ కొవిడ్ సెంటర్‌లు ప్రారంభం