Allegations on Minister Ambati Rambabu: కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో పర్యటించిన పవన్.. మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి పలు ఆరోపణలు చేశారు. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి ప్రభుత్వమిచ్చే పరిహారం డబ్బుల్లోనూ ఎమ్మెల్యే, మంత్రి స్థాయి వ్యక్తులు లంచం డిమాండ్ చేస్తున్నారంటూ.. అంబటి రాంబాబు పేరును ప్రస్తావించారు.
ఆ వెంటనే పవన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన అంబటి రాంబాబు.. తాను లంచం అడిగినట్లు ఏ ఒక్కరితోనైనా చెప్పించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవితోపాటు శాసనసభ్యత్వానికి రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. మంత్రి అంబటి సవాల్ చేసిన 24 గంటల్లోపే ఆయనపై ఆరోపణలు గుప్పిస్తూ బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి.
సత్తెనపల్లిలో అచ్చంపేట రైల్వేగేట్ సమీపాన నివసించే పర్లయ్య, గంగమ్మ దంపతులు.. అంబటి రాంబాబు తమను డబ్బులు డిమాండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్లయ్య, గంగమ్మ దంపతుల కుమారుడు అనిల్.. ఈ ఏడాది ఆగస్టు 20వ తేదిన డ్రైనేజి శుభ్రం చేసేందుకు వెళ్లి అందులో ప్రమాదవశాత్తు పడి మరణించాడు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల సాయం మంజూరైంది.
అందులో రూ.2.50 లక్షలు ఇవ్వాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ చలంచర్ల లక్ష్మితులసి భర్త సాంబశివరావు అడిగారని.. దీనిపై మంత్రి అంబటి రాంబాబును కలిసి ఫిర్యాదు చేస్తే ఆ నగదు ఇవ్వాల్సిందేనన్నారని దంపతులు వాపోయారు. తమకు ఎలాంటి ఆస్తులు లేవని.. ప్రభుత్వ సాయం రూ.5 లక్షలు అందజేస్తే కుమార్తె పెళ్లిచేద్దామనుకున్నట్లు తెలిపారు. డబ్బులు ఇచ్చేయాలని లేకపోతే ఇబ్బందులు తప్పవని సీఐ నుంచి బెదిరింపులు రావడంతో ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు వాపోయారు.
కేవలం తమ కుమార్తె కోసమే ఆగామని ఆవేదనగా చెప్పారు. 20 రోజులక్రితం వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5 లక్షల చెక్కు రాగా.. ఇంకా అది వీరి చేతికి చేరలేదు. వీడియోలు బయటకు రావటంతో పర్లయ్య దంపతులపై వైసీపీ నేతల బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో వారు స్థానిక జనసేన నాయకులకు సమాచారమిచ్చారు. వైసీపీ నాయకుల నుంచి ఆ కుటుంబానికి ముప్పు ఉన్న నేపథ్యంలో వారిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు.
మంత్రి అంబటి రాంబాబుపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు నిజమని.. అందుకు పర్లయ్య, గంగమ్మ రోదనే సాక్ష్యమని.. ఇంతకంటే నిదర్శనం కావాలా అని జనసేన నేత సాంబశివరావు ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌కు ఛాలెంజ్‌లు విసిరేప్పుడు సంయమనంతో మాట్లాడాలని మంత్రి రాంబాబుకు హితవు పలికారు. చేతికి అందివచ్చిన కొడుకు పోయి ఏడుస్తుంటే.. ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారంలో వాటా అడగడం వైసీపీ నాయకులకే చెల్లుబాటు అయ్యిందని.. దీనికి మంత్రి అంబటి సమాధానం చెప్పాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: