తాత్కాలిక సచివాలయం.. బూర్గుల రామకృష్ణారావు భవన్లో ఈరోజు నుంచి ఉన్నతాధికారుల కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఇప్పటికే పలు శాఖలు సచివాలయం నుంచి బీఆర్కే భవన్కు తరలాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా కార్యదర్శుల కార్యాలయాలన్నీ సచివాలయం నుంచి బూర్గుల రామకృష్ణారావు భవన్కు తరలించారు. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు శాఖ కార్యదర్శి, విభాగాల కార్యాలయాలు పూర్తిగా ఎర్రమంజిల్కు తరలాయి. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కార్యాలయాన్ని బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి తరలించారు. మిగతా కార్యాలయాలు, విభాగాల తరలింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
ఇక అక్కడి నుంచి తక్కువే..
బీఆర్కే భవన్లో గత మూడు రోజులుగా మరమ్మతులు వేగంగా సాగాయి. అవసరమైన మరమ్మతులు పూర్తి చేసి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈరోజు నుంచి పాత సచివాలయంలో అధికారిక కార్యాకలాపాలు సాగే అవకాశాలు తక్కువే. సీఎస్ సహా కార్యదర్శులు ఇక సచివాలయం వెళ్లే అవకాశాలు లేవు. బీఆర్కే భవన్ నుంచే వారు తమ విధులను నిర్వర్తించనున్నారు.
బీఆర్కే భవన్ నుంచే..
వీలైనంత వరకు అందరు బీఆర్కే భవన్ వేదికగానే పనిచేస్తారని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ మరమ్మతులు పూర్తి కాకుండా, అవసరమైన సౌకర్యాలు సమకూరకపోతే వేరే చోట నుంచి కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి కొన్నాళ్ల పాటు కుందన్ బాగ్లోని క్యాంపు కార్యాలయం నుంచి విధులు కొనసాగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మూడు, నాలుగు రోజుల్లో..
సచివాలయంలో ఇంకా మిగిలిన కార్యాలయాలు, విభాగాల తరలింపు ప్రక్రియ మరో మూడు, నాలుగు రోజుల్లో పూర్తి కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కార్యాలయంతో పాటు సీఎంఓ కార్యదర్శుల కార్యాలయాల తరలింపు ప్రక్రియ ఇంకా జరగాల్సి ఉంది. ఈ కార్యాలయాలను బేగంపేటలోని మెట్రో రైల్ భవన్లోకి తరలించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఆదేశాలు రాగానే వెంటనే కార్యాలయ తరలింపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి : అందాల జూరాల... ఆ జలదృశ్యాన్ని కళ్లారా చూడాలా...