ఎస్సీ యువత పారిశ్రామిక, సాంకేతిక సహా ఇతర రంగాల్లో స్వయం ఉపాధి పొందేలా ప్రభుత్వం తోడ్పడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గ్రామీణ, పట్టణ ఎస్సీల సమస్యలు గుర్తించి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్లో జరిగిన అఖిలపక్ష భేటీలో ఎస్సీల సమస్యలు, అభివృద్ధి ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. దళిత సాధికారత పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. అర్హులకు నేరుగా ఆర్ధిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీల్లో అర్హులైన కుటుంబాల గణన జరపాలని అధికారులకు నిర్దేశించారు. అత్యంత పారదర్శకంగా దళారీలు లేని విధానానికి సలహాలు ఇవ్వాలని.. ప్రతిపక్షాలను కోరారు.
నేతలంతా కలిసిరావాలి..
ఎస్సీ సాధికారతకు బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించామన్న సీఎం.. మరో రూ.500 కోట్లు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. 3, 4 ఏళ్లలో రూ.35 నుంచి 40 వేల కోట్లు ఖర్చుచేసే యోచన ఉందన్నారు. ఈ బడ్జెట్ ఎస్సీ ఉపప్రణాళికకు అదనమని ప్రకటించారు. ఎస్సీల సాధికారత సాధనకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకు అఖిలపక్ష నేతలంతా కలిసిరావాలని కోరారు.
అందుకు పాలకులే బాధ్యులవుతారు..
ఎస్సీ సాధికారత పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేద్దామని సీఎం కేసీఆర్ విపక్షాలకు పిలుపునిచ్చారు. పైరవీలకు ఆస్కారం లేని, పారదర్శక విధానాన్ని అమలు పరుద్దామన్నారు. రాజకీయాలకు అతీతంగా సమష్టి కార్యాచరణ చేపట్టే బాధ్యత అందరం తీసుకుందామన్నారు. సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది చంటి పిల్లను పోషించే పాత్రగా సీఎం అభివర్ణించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయని, అందుకు పాలకులే బాధ్యులవుతారని సీఎం పేర్కొన్నారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరు పోయినా.. సామాజికంగా, ఆర్థికంగా పీడిత వర్కాలు ఎవరంటే చెప్పే పేరు ఎస్సీ,ఎస్టీలే అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ బాధ పోవడానికి, వారు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి సర్కార్ కార్యాచరణ సిద్ధం చేస్తోందని తెలిపారు. దశలవారీగా ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు.
సీఎం కేసీఆర్(CM KCR) ఆధ్యక్షతన సీఎం దళిత సాధికారత(CM Dalit Empowerment Scheme ) సమావేశం ప్రగతిభవన్‌లో కొనసాగుతోంది. ఈ సమావేశానికి హాజరైన అఖిలపక్ష నేతల నుంచి పలు సూచనలు, సలహాలు కోరారు. ఎస్సీ, ఎస్టీల సామాజిక, ఆర్థిక బాధలు తొలగిపోవాలంటే ఏం చేయాలో దశల వారిగా కార్యాచరణ అమలు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. తాము కూడా పురోగమించగలం అనే ఆత్మస్థైర్యంతో ఎస్సీ,ఎస్టీలు ముందుకు సాగడానికి రాష్ట్ర సర్కార్‌కు తగిన సూచనలు ఇవ్వాలని అఖిల పక్ష నేతలను కోరారు.
ఈ సమావేశానికి కాంగ్రెస్ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరయ్యారు. ఎంఐఎం నుంచి ఎమ్మెల్యేలు అహ్మద్ బలాల, పాషా ఖాద్రీలతో పాటు ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధితులు ప్రభుత్వ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
తమ్మినేని స్పందన..
ఎస్సీల సాధికారతకు కేసీఆర్ చొరవ సంతోషకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మరియమ్మ లాకప్‌డెత్ కేసులో సీఎం తక్షణం స్పందించారంటూ ప్రశంసించారు. కేసీఆర్ నిర్ణయం.. ఎస్సీల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచిందని అభిప్రాయపడ్డారు. ఎస్సీల సాధికారత కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి తమ్మినేని వీరభద్రం సూచించారు. అందుకు తమ సంపూర్ణ సహకారం ఉంటుదని తమ్మినేని వెల్లడించారు.
సీఎం ముందుకు రావడం సంతోషం..
దళిత సాధికారత కోసం సీఎం స్వయంగా ముందుకు రావడం., అటువంటి ఆలోచన చేయడం సంతోషంగా వుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. 2003 లోనే దళిత సాధికారత కోసం కేసీఆర్.. సమావేశం ఏర్పాటు చేసి అనేక అంశాలను చర్చించడం నాకు తనకు గుర్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి వంటి పలు అభివృధ్ధి, సంక్షేమ పథకాలు దళితులకు భరోసానిస్తున్నాయని చాడ తెలిపారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించడం సహా దళితుల మీద దాడులు జరిగితే ఊరుకొనే ప్రసక్తే లేదనే రీతిలో కార్యాచరణ చేపట్టి, ప్రభుత్వం దళితులకు మరింతగా ధైర్యాన్ని నింపాలని ప్రభుత్వానికి సూచించారు.
ఇదీ చూడండి: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అభిమానుల శుభాకాంక్షల వెల్లువ