కరోనా యోధులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అసెంబ్లీలో పేర్కొన్నారు. వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు సెల్యూట్ అని అన్నారు. మంత్రి ఈటల ప్రకటనలో కరోనా యోధుల గురించి ప్రస్తావనే లేదని చెప్పారు. కరోనాతో అనేకమంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ప్రాణాలు కోల్పోయిన కరోనా యోధుల కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. తమ పార్టీ తరఫున లక్ష ఆహార ప్యాకెట్లు సరఫరా చేశామని తెలిపారు.
కరోనా కష్టకాలంలో ఎంఐఎం సభ్యులు ప్రజల్లోనే ఉన్నారన్నారు. సమాజంలోని అన్ని రంగాలను కరోనా ప్రభావితం చేసిందని వెల్లడించారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న వారిపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదని వ్యాఖ్యానించారు.
కరోనా విషయంలో అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేసీఆర్ శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు ఎందుకు కోపం వస్తుందో తెలియడం లేదని అక్బరుద్దీన్ అన్నారు. కరోనా నియంత్రణకు మంత్రి ఈటల పగలు, రాత్రి పనిచేశారని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా రాష్ట్రంలో కరోనా ఇంకా తగ్గలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా కట్టడి కోసం స్పష్టమైన ప్రణాళిక ఉండాలని సూచించారు. లాక్‌డౌన్ విధించిన సమయం సరైంది కాదని చెప్పారు. కరోనాపై మాట్లాడేందుకు సమయం ఇవ్వకపోవడంపై అక్బరుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: శాసనసభలో స్పీకర్‌తో విపక్షాల వాగ్వాదం