Akbaruddin Owaisi Questioned Congress Govt to White Papers : శ్వేతపత్రం విడుదల వెనుక ఉద్దేశం ఏంటో ప్రభుత్వం చెప్పాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi) కోరారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అని, అలాగని రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజకీయాల కంటే రాష్ట్ర సమగ్రతను కాపాడటం మన మొదటి కర్తవ్యమని తెలిపారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పడానికే శ్వేతపత్రం(White Papers Release) విడుదల చేశామని మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు.
అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నల వర్షం : తెలంగాణ వస్తే అంధకారమేనని గతంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని అక్బరుద్దీన్ గుర్తు చేశారు. కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చాకే విద్యుత్, తాగునీరు అన్నీ వచ్చాయని కితాబిచ్చారు. రాష్ట్రం ముమ్మాటికీ లాభదాయక రాష్ట్రమేనని, అప్పులు పెరిగినా అభివృద్ధి కూడా గణనీయంగా జరిగిందని కొనియాడారు. రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలోనూ అప్పులు పెరిగాయని పేర్కొన్నారు. కేంద్రం రూ.44,25,347 కోట్ల అప్పు చేసిందని, దాన్ని ఎందుకు ప్రశ్నించరన్నారు. కేంద్రం గత పదేళ్లలో 244 శాతం అప్పులు పెంచిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం అంతా తప్పుల తడకగా ఉందని ధ్వజమెత్తారు.
Akbaruddin Owaisi Questioned Congress Govt : శ్వేతపత్రంలో ఆర్బీఐ, కాగ్ రిపోర్టులను ప్రస్తావించారని అక్బరుద్దీన్ అన్నారు. వారికి అనుకూలమైన అంశాలనే తీసుకున్నారని చెప్పారు. శ్వేతపత్రంలో రాష్ట్ర బడ్జెట్ సమాచారం మాత్రం వాడలేదని దుయ్యబట్టారు. అందుకే రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు తాను మాట్లాడుతున్నానన్నారు. అసెంబ్లీ నుంచి తప్పుడు సమాచారం బయటకు పంపకూడదని హితవు పలికారు. రాష్ట్రానికి ఏదో జరిగిందన్న సందేశం సభ నుంచి వెళ్లకూడదన్నారు. తప్పు జరిగిందని భావిస్తే ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని సూచించారు. సభను తప్పుదోవ పట్టించిన బ్యూరోక్రాట్లపై చర్యలు తీసుకోవాలని సభాపతిని కోరారు.
ఎన్ని సంవత్సరాలు కష్టపడినా నిన్ను సీఎంని చేయరు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సమాధానమిచ్చిన మంత్రి శ్రీధర్ బాబు : రాష్ట్రాన్ని అవమానించేందుకు శ్వేతపత్రం పెట్టలేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ప్రపంచానికి చెప్పేందుకు మాత్రమే శ్వేతపత్రం విడుదల చేయలేదని చెప్పారు. పదేళ్ల పాలన ప్రోగ్రెస్ రిపోర్టు మాత్రమే చెప్పదలచుకున్నానన్నారు. అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం కూడా ముందుకెళ్లదని వివరించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు సరైన విధానంలో ఖర్చు చేశారా లేదా అన్ని చెప్పేందుకే మేమున్నామని అన్నారు. తమ పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే నంబరు వన్‌గా నిలుపుతామన్నారు. కాగ్ రిపోర్టు ప్రకారమే శ్వేతపత్రం రూపొందించామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
శాసనసభలో 42 పేజీల శ్వేతపత్రం - తెలంగాణ మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు
హరీశ్‌రావు వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - మోటార్లకు మీటర్ల విషయంలో మాటల యుద్ధం