No Permission for New Engineering Colleges: ఆధునిక సాంకేతికతలకు చెందిన కోర్సులు అందుబాటులోకి రావడంతో కోర్(సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) బ్రాంచీలకు ఆదరణ తగ్గిన మాట వాస్తవం. ప్రస్తుతం కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ వంటి ఎమర్జింగ్ రంగాలపై విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త ఇంజినీరింగ్ కళాశాలలు స్థాపించేందుకు అనుమతి ఇవ్వట్లేదని.. అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ఛైర్మన్ ప్రొ.అనిల్.డి.సహస్రబుద్ధే తెలిపారు. అందుకే కొత్త రంగాలను పాత బ్రాంచీలతో అనుసంధానించే ప్రక్రియపై ఏఐసీటీఈ కసరత్తు చేస్తోంది. వాస్తవానికి ఈ రెంటినీ వేర్వేరుగా చూడలేమని.. కోర్ బ్రాంచీలు ఎంచుకునే విద్యార్థులు కృత్రిమమేధ, డాటా సైన్స్, మెటీరియల్స్ రంగాలపై పట్టు పెంచుకోవడం అవసరమన్నారు. కోర్ బ్రాంచీల విద్యార్థులకు ఎమర్జింగ్ రంగాల్లో కోర్సులలో మైనర్ డిగ్రీలు ఇచ్చేందుకు యూనివర్సిటీలు, కళాశాలలు ప్రయత్నించాలిని సూచించారు. ఏఐసీటీఈ తరఫున పాఠ్య ప్రణాళికల్లో మార్పులు తెచ్చి, అధ్యాపకులకు మైనర్ డిగ్రీలు ఇచ్చే విషయంపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేశారు. కళాశాలలు సైతం మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచీలనే అందిస్తోండటంతో విద్యార్థులు తక్కువగా చేరుతున్నారని.. మైనర్ డిగ్రీలు అందించే విధానం తీసుకొస్తే తప్పక ఆదరణ ఉంటుందని వెల్లడించారు.
మౌలిక వసతులు వృథా కారాదనే..
బీవీఆర్ మోహన్‌రెడ్డి కమిటీ సూచనల మేరకు రెండేళ్లుగా కొత్త కళాశాలలకు అనుమతి ఇవ్వడం నిలిపివేశాం. దాన్నిపుడు మరో రెండేళ్లు పొడిగిస్తున్నాం. ఇప్పటికే ఉన్న కళాశాలల్లో మౌలిక వసతులను వృథా చేయకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. జాతీయ విద్యావిధానం అమలులోకి వస్తే ఎక్కువ సబ్జెక్టులు ఎంచుకునేందుకు విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. యూజీ స్థాయిలో బ్రేక్ తీసుకుని.. మళ్లీ వచ్చి చేరేందుకు వీలుంటుంది. గతంలో విద్యార్థి చదువు మధ్యలో మానేస్తే అప్పటివరకు సాధించిన క్రెడిట్స్ వృథా అయ్యేవి. జాతీయ స్థాయిలో అకడమిక్ క్రెడిట్ బ్యాంకు ఏర్పాటుతో ఇక ఆ పరిస్థితి ఉండదు. ఎన్‌ఆర్‌ఎఫ్ కారణంగా పరిశోధనలకు ఆసరా లభిస్తుంది. విద్యార్థులలో సాధికారతతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కొత్త విధానం ఉపకరిస్తుంది. అంకురాల ఏర్పాటుతో కొత్త ఉద్యోగాలు వస్తాయి.
ఏఐసీటీఈ ఛైర్మన్ ప్రొ.అనిల్.డి.సహస్రబుద్ధే
ప్రమాణాలు పాటించకపోతే మూసివేతే
వచ్చే 15 ఏళ్లలో ప్రతి కళాశాల డిగ్రీలు ఇచ్చే స్థాయికి ఎదగాలని జాతీయ విద్యావిధానం సూచిస్తోందన్న సహస్రబుద్ధే... ఏఐసీటీఈ తరఫున అన్ని కళాశాలలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. వాటిని అందిపుచ్చుకుని ముందుగా నాణ్యత ప్రమాణాలు మెరుగుపరచుకుని అక్రిడిటేషన్ పొందాలన్నారు. స్వయంప్రతిపత్తి హోదా తెచ్చుకోవాలని... అప్పుడే డిగ్రీలు ప్రదానం చేసేందుకు వీలుంటుందని స్పష్టం చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించని కళాశాలలను ఉపేక్షించమని... అలాంటివన్నీ మూసివేయక తప్పదని హెచ్చరించారు. నాణ్యమైన కళాశాలలే భవిష్యత్తులో మనుగడ కొనసాగించగలిగేదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Engineering Seats in Telangana: ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో భర్తీ కాని సీట్లు