రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు దాటినా అంతర్రాష్ట్ర బదిలీలకు నోచుకోక ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారంటూ సీఎం కేసీఆర్‌కు ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి లేఖ రాశారు. ఉద్యోగరీత్యా భార్యాభర్తలు వేర్వేరు రాష్ట్రాల్లో దూరంగా, జీవితాలు భారంగా నెట్టుకొస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతరాష్ట్ర ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించి... మూడేళ్ల కిందట ఇచ్చిన జీవో ఇవాళ్టికీ అమలు కాలేదని ఆరోపించారు.
2017 ఆగస్టు ఏడున ఇచ్చిన జీవో ప్రకారం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల బదిలీ ప్రక్రియ 2 నెలల్లో పూర్తి చేయాల్సి ఉందన్నారు. అయినప్పటికీ ఎన్నో బదిలీ ఫైళ్లు సెక్షన్ ఆఫీసర్ల దగ్గర మూలుగుతున్నాయని, లంచాలు ఇచ్చిన వారివి మాత్రమే ఆఘమేఘాల మీద ఉత్తర్వులు విడుదలవుతున్నాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తక్షణమే బదిలీలపై సానుకూల నిర్ణయం తీసుకొని ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చాలని వంశీచంద్‌రెడ్డి కోరారు.