భారత్ - చైనా బలగాల మధ్య లద్దాక్ వద్ద గాల్వన్ లోయలో చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణలో... మాతృభూమి రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అతని అమరత్వం, త్యాగం, దేశభక్తి, ధైర్యం ఎల్లప్పుడూ చిరస్మరణీయమని కొనియాడారు. కల్నల్ సంతోష్ బాబును ఈ దేశం ఎల్లపుడు గౌరవిస్తుందని, గుర్తుకుచేసుకుంటుందని ఆయన భార్యకు తెలియచేశారు.
భరతమాత ముద్దు బిడ్డ కల్నల్ సంతోష్ బాబుకు భారమైన హృదయంతో నివాళులు అర్పిస్తున్నానని సోనియా పేర్కొన్నారు. ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని భరించేందుకు కుటుంబ సభ్యులకు భగవంతుడు శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తూ.. కల్నల్ సంతోష్ బాబు ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
రాహుల్ గాంధీ ప్రగాఢ సంతాపం..
కల్నల్ సంతోష్‌బాబు వీర మరణం పట్ల ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆ మేరకు కల్నల్ భార్య సంతోషికి ఆయన లేఖ రాశారు. దేశంలో ప్రతి పౌరుడు శాంతియుతంగా, స్వతంత్రంగా జీవించేందుకు కల్నల్ సంతోష్ బాబు చేసిన త్యాగాన్ని ఈ దేశం ఎన్నటికీ మరిచిపోదని, ఎప్పటికి గుర్తు పెట్టుకుంటుందన్నారు. ఒక దేశ భక్తుడిని ఈ జాతి కోల్పోయిందని, ఇలాంటి విపత్కర పరిస్థితులలో సంతోషబాబు కుటుంబానికి జాతి యావత్తు అండగా ఉంటుందన్నారు.
ఇదీ చూడండి: ఘర్షణకు ముందు చైనా భారీ సైనిక విన్యాసాలు