Mallikarjuna Kharge phoned Uttam Kumar Reddy : పీసీసీ వ్యతిరేక సీనియర్ నేతలకు ఏఐసీసీ అధ్యక్ష కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్లు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలెటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినట్లు ఆయన తెలిపారు. వారం రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని ఖర్గే స్పష్టం చేసినట్లు వివరించారు. నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచినట్లు తెలిపారు.
పార్టీ అధిష్ఠానం నుంచి ఫోన్ రావడంతో రేపటి కాంగ్రెస్ అవగాహన సదస్సుకు హాజరు కావాలా.. లేదా అనే అంశంపై అసంతృప్త నేతలు తర్జన భర్జనపడుతున్నారు. పార్టీ పిలుపు మేరకు "హాత్ సే హాత్ జోడో అభియాన్" కార్యక్రమంతో పాటు ఇతర అంశాలపై కాంగ్రెస్ నాయకులకు అవగాహన కల్గించేందుకు రేపు బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో పీసీసీ అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు ఏఐసీసీ నుంచి ఎలాంటి అనుమతి లేదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ స్పష్టం చేశారు. పార్టీ ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం జనవరి 26వ తేదీ నుంచి రెండు నెలలపాటు బ్లాక్ స్థాయిలో పాదయాత్ర నిర్వహించాలని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. చివరగా హైదరాబాద్‌లో నిర్వహించనున్న పాదయాత్రలో రాహుల్ గాంధీ పాల్గొంటారని తెలిపారు. అదే విధంగా మహిళా కాంగ్రెస్ నిర్వహించే పాదయాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొంటారని ఆయన వివరించారు.
ఇవీ చదవండి: