పంటలకు గిట్టుబాటు, మద్దతు ధరను అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సమగ్ర వ్యవసాయ విధానంపై అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి సమీక్షించారు. త్వరలో అమల్లోకి రాబోతున్న వ్యవసాయ విధి విధానాలు, మార్గదర్శకాలు వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ప్రభుత్వ పథకాలు, సాగు వనరులు, నీటి రాకతో పెద్ద ఎత్తున వ్యవసాయం వైపు దృష్టి సారిస్తున్న తరుణంలో... ఎదురయ్యే ఇబ్బందుల గురించి చర్చించారు. వరికి ప్రత్యామ్నాయంగా కంది, ఆముదం, ఆవాలు, వేరుశనగ, ఆయిల్ పామ్ వంటి పప్పు, నూనె పంటల సాగు పెంచాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు.
వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని విత్తనాలు ఎంతవరకు అందుబాటులో ఉంటాయన్న అంశంపై కసరత్తు చేయాలని మంత్రి తెలిపారు. పంటల సాగుకు సంబంధించి రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు కావాలి...? ప్రభుత్వం ఏం సమకూర్చాలి? అన్న అంశాలపై అధికారులు నివేదికలు తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో కొత్త అడుగులు పడుతున్నాయని... అందుకు సీఎం సాహసోపేత చర్యలే నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వర్సిటీ ఉపకుపలపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు, మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి, ఉద్యాన శాఖ సంచాలకులు లోక వెంకట్రాం రెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ముద్దు పెట్టినందుకు వెంటాడుతున్న కరోనా..!