కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ రైతు ఎకరా పొలంలో మిర్చి పంట వేశారు. అకాల వర్షాలు, వడగళ్లతో పంట దెబ్బతింది. అధికారులు పంట నష్టాన్ని సర్వే చేశారు. కానీ 33 శాతం కంటే తక్కువగా ఉందన్న కారణంగా.. ఆ వివరాలు నమోదు చేయలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో అన్నదాత స్వామి అర ఎకరాలో ఉల్లి పంట సాగు చేశారు. సూర్యాపేట జిల్లాలో మామిడి రైతు నాగరాజు.. ఇలా పలువురు ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది. పంట నష్టం అంచనా వేసే క్రమంలో వ్యవసాయ శాఖ నిబంధన ఇలాంటి ఎందరో అన్నదాతల పాలిట శాపంగా మారింది.
వరదలు, భారీ వర్షాలు, వడగళ్లు, ఇతర రకాలుగా నష్టపోయినా.. 33 శాతం కంటే ఎక్కువ ఉంటేనే దానిని పంట నష్టంగా నమోదు చేసే విధానం అమలులో ఉంది. దీంతో చాలా మందికి సాయం అందని పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ శాఖ ఆది నుంచి ఈ నిబంధనను అమలు చేస్తోంది. అయితే వ్యవసాయ శాఖ 33 శాతం కంటే తక్కువ పంట నష్టం ఉంటే దానిని పరిగణలోనికి తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే పరిహారంతో పాటు బీమా పథకం అమలులోనూ ఇదే నిబంధనను అమలు చేస్తుంది. తద్వారా అలాంటి అన్నదాతలు కనీస సాయానికి నోచుకోలేకపోతున్నారు. వ్యవసాయాధికారులు పంట నష్టంపై క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనా వేస్తారు. ఈ క్రమంలోనే అన్నదాతల సామాజిక స్థితి, భూమి ఆధారంగా వారిని.. చిన్న లేదా సన్నకారు లేదా ఎక్కువ ఎకరాలున్న రైతులుగా నమోదు చేస్తారు.
మరోవైపు వారికి ఉన్న భూమి, వేసిన పంటల ఆధారంగా.. 33 శాతం కంటే తక్కువ,.. 33-50 శాతం, 50 శాతం కంటే ఎక్కువ కేటగిరీలుగా విభజించి పంట నష్టం వివరాలను నమోదు చేస్తారు. ఈ క్రమంలోనే 33 శాతం కంటే తక్కువ నష్టపోతే అందులో వివరాలు నమోదు చేయడం లేదు. మిగతా రెండు కేటగిరీలనే నమోదు చేస్తున్నారు. ఈ వివరాల నమోదు అనంతరం వ్యవసాయాధికారులు ఈ జాబితాలను.. గ్రామ పంచాయతీల వారీగా నోటీసు బోర్డులపై పెడుతున్నారు.
అయితే 33 శాతం కంటే తక్కువ నిబంధన అమలు ద్వారా చాలా మంది అన్నదాతల వివరాలు వాటిలో లేకపోవడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. ఈ మేరకు అధికారులను ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి వర్షాలు కురిస్తే 10 నుంచి 20 శాతానికిపైగా నష్టం వాటిల్లుతోంది. వరి, పత్తి, మిర్చి వంటి పంటలు విలువైనవి. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వెచ్చిస్తున్నారు. అందులో 33 శాతం వరకు నష్టం కూడా రైతులకు ఇబ్బందికర పరిణామమే. వాటిని నమోదు చేయాలని అన్నదాతలు కోరుతున్నా.. నిబంధనల పేరిట వ్యవసాయాధికారులు తిరస్కరించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిబంధనలను సడలించాలని రైతులు కోరుతున్నారు. ఎంత నష్టం జరిగినా వివరాలు నమోదు చేయాలన్నారు.
వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.20,000 చొప్పున పరిహారం అందించి ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు ప్రభుత్వాన్ని కోరారు. అతివృష్టి, అనావృష్టి, వడగళ్లు, చీడపీడల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు బీమా అమలులో లేనందున మరింత నష్టపోవాల్సి వస్తోందని శ్రీహరిరావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: నిండాముంచిన అకాల వర్షాలు: అన్నదాతలకు 'చేదు' మాత్రమే మిగిలింది..
నేడు పలు జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన.. దెబ్బతిన్న పంటల పరిశీలన
పద్మ భూషణ్ అందుకున్న మంగళం బిర్లా.. అట్టహాసంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం