దేశంలో అంకుర కేంద్రాలకు ఆదరణ మరింత పెరుగుతోంది. ఉపాధి, ఉద్యోగ మార్కెటింగ్ అవకాశాలు విస్తృతమవుతున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో అద్భుతమైన అవకాశాలు ఉండటంతో రైతులు, వినియోగదారులకు సేవలందిస్తూ యువత మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు... హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్-నేషనల్ అకాడెమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్-నార్మ్ ఆధ్వర్యంలో 'అగ్రి ఉడాన్ 4.0' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
రైతుల ఆత్మహత్యలు ఆపడమే లక్ష్యం
వ్యవసాయ సంక్లిష్టతలు, రైతుల ఆత్మహత్యలు ఆపే లక్ష్యంతో... నార్మ్ ప్రత్యేక చొరవ చూపుతోంది. నాబార్డ్ చేయూతతో ఏ-ఐడియా కార్యక్రమానికి 2015లో శ్రీకారం చుట్టింది. కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని గుర్తించి... యువతకు అవసరమైన శిక్షణిచ్చి.. రైతులకు చేరేలా చేస్తోంది. దానికి తోడుగా సస్యరక్షణ చర్యలు, పంట కోతలు, మార్కెటింగ్ మెళకువలు సహా గిట్టుబాటు ధర లభించేలా చేయాలని నార్మ్ సంకల్పించింది. అందులో భాగంగా 'అగ్రి ఉడాన్ 4.0' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి ఎగుమతుల పెంపుపై దృష్టిసారించినట్లు నార్మ్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.
4.7 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు
ఐడియా టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా సేవలందిస్తోంది. గ్రామీణ ఆవిష్కరణలు గుర్తించి వాణిజ్యపరంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేలా యువతకు ప్రోత్సాహం అందిస్తోంది. అంకుర కేంద్రం లేదా పరిశ్రమ స్థాపించేందుకు రూ.25 లక్షలు గ్రాంట్‌గా ఇచ్చి వాటా తీసుకుంటోంది. అవి విజయవంతమైన తర్వాత అంకుర కేంద్రం ద్వారా రైతులకు సేవలందించేలా పర్యవేక్షిస్తోంది. ఇప్పటివరకు 450 ఇంకుబేటర్లు, 40 వేలకుపైగా అంకుర కేంద్రాలు ఏర్పాటుకాగా... 4.7 లక్షల మంది యువత, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి. అంకుర కేంద్రాలకు భారీగా రుణాలు ఇవ్వాలని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేయగా... నార్మ్ అమలు చేస్తోందని ఏ-ఐడియా ఇంఛార్జ్ సుమంత్ వివరించారు.
ఔత్సాహికులను వెలుగులోకి తేవడమే లక్ష్యం
దేశవ్యాప్తంగా ప్రతి ఏటా ఐసీఏఆర్, వ్యవసాయ, ఉద్యాన, పశు విశ్వవిద్యాలయాల నుంచి 12 వేల మంది పట్టభద్రులుగా బయటకొస్తున్నారు. 2వేల మందికి పైగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. మిగతావాళ్లు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలవైపు మళ్లుతున్నారు. 'అగ్రిఉడాన్ 4.0' ద్వారా ఆవిష్కర్తల దరఖాస్తులు ఆహ్వానించి పలు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ర్యాలీలు నిర్వహించి ఔత్సాహికులను వెలుగులోకి తేవాలన్నదే తమ లక్ష్యమని నార్మ్ వెల్లడించింది. గ్రామీణ వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతున్నా నిర్వహణ సామర్థ్యం పెరగాల్సిన తరుణం వచ్చింది. రైతుల ఆదాయం పెరగడమే కాకుండా.. సహజవనరుల సద్వినియోగం, కొత్త ఆవిష్కరణలు, ఐటీ, కృత్రిమ మేథ, అంతరిక్ష, డ్రోన్, మొబైల్ టెక్నాలజీ సేవలు అన్నదాతకు చేరువ చేయడంలో అంకుర కేంద్రాలు కీలకంగా మారబోతున్నాయి.
ఇదీ చదవండి: గాంధీలో కరోనా రోగులకు బలవర్ధక ఆహారం