హైదరాబాద్ జిల్లా సైన్స్ విభాగం ఆధ్వర్యంలో 15 రోజుల కిందట 4 వాట్సాప్ గ్రూపులు తయారు చేశారు. ఒక గ్రూపులో ప్రత్యేకంగా సబ్జెక్టు నిపుణులుంటారు. అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో బయాలజీ, ఫిజికల్ సైన్స్ పరంగా నిపుణుల సూచనలతో ప్రయోగాలు చేస్తూ వీడియో తీస్తారు.
6 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాల్లోని ప్రయోగాల్లో నిత్యం ఒకటి ఎంపిక చేసి ప్రతక్ష్యంగా చేసి చూపిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో పంపుతున్నారు. ఆ ప్రయోగాలను విద్యార్థులు సొంతగా చేసి వీడియో తీసి అప్‌లోడ్ చేస్తారు. సబ్జెక్టు నిపుణులు, అగస్త్య ఫౌండేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు కలిసి.. ఆ వీడియోలను వేర్వేరు గ్రూపులకు షేర్ చేస్తారు.
ఇలా నిత్యం 4 వేల మందికి సైన్స్ ప్రయోగాలు చేరువయ్యేలా కృషి చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే కాకుండా తెలంగాణ, ఏపీలోని ఇతర జిల్లాల విద్యార్థులు ఈ క్రతువులో భాగస్వాములవుతున్నారు. సెలవుల్లో తమ మేధస్సు, ఆలోచనలను ప్రయోగాల వైపునకు మళ్లిస్తూ సరదాగా గడుపుతున్నారు.
ఇంట్లో ఉండే ప్రయోగాలు చేసేలా ప్రణాళిక...
విద్యార్థులను శాస్త్ర విజ్ఞానం వైపు మళ్లించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి అగస్త్య ఫౌండేషన్ ఎంతో సహకరిస్తోందని హైదరాబాద్ జిల్లా సైన్స్ అధికారి జి.ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుతం ఎవరూ బయటకు వెళ్లే అవకాశం లేదు.. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ప్రయోగాలు చేసేలా రూపకల్పన చేశామన్నారు. ఇందులో భాగస్వాములు కావాలనుకొనే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు.. 93462 73583, 96522 29582 నంబర్లలో సంప్రదించవచ్చని చెప్పారు.