తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విద్యుత్తు సంస్థల్లో ఉద్యోగుల పంపకాల అంశంపై మళ్లీ వివాదం మొదలైంది. ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు పంచుతూ గత నెల 26న జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఆదేశాలిచ్చింది. తాము సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, తీర్పు వచ్చేదాకా ఏ ఒక్క ఉద్యోగినీ తెలంగాణ సంస్థల నుంచి రిలీవ్ చేయోద్దని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ అంశంపై శనివారం తెలంగాణ ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావుకు లేఖ రాశారు.
వారిని తీసుకోలేం..
రాష్ట్ర విభజన సందర్భంగా ‘ఆర్డర్ టూ సర్వ్’ అనే పేరుతో రెండు రాష్ట్రాలకు కేటాయించిన రాష్ట్రస్థాయి ఉద్యోగులు జాబితాల్లో లేనందున కమిటీ కేటాయించిన వారిని తీసుకోలేం అని ఆయన తెలిపారు. కమిటీ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. దీనిపై తీర్పు వచ్చే వరకూ ఏ ఒక్క ఉద్యోగినీ రిలీవ్ చేయవద్దని ఆయన కోరారు. ఈ ఆదేశాల అమలును అప్పటివరకూ పెండింగులో పెట్టాల్సిందిగా జస్టిస్ ధర్మాధికారి కమిటీని కూడా గత నెల 30న కోరినట్లు తెలిపారు. తెలంగాణ నుంచి ఎవరినైనా రిలీవ్ చేస్తే వారికి నియామక ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు.
ఆర్థిక భారమే కారణం?
తెలంగాణ విద్యుత్తు సంస్థల నుంచి 655 మందిని శనివారం రిలీవ్ చేశారు. కమిటీ ఆదేశాల ప్రకారం వీరిని ఏపీ విద్యుత్తు సంస్థల్లో చేర్చుకోవాలి. కానీ ఏపీ సంస్థల తాజా నిర్ణయంతో వీరు ఎక్కడా పనిచేయలేక ఎదురుచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ నుంచి సీనియర్ ఉద్యోగులు 655 మందిని చేర్చుకుంటే వారి ఉద్యోగ విరమణ, అనంతరం చెల్లింపుల వరకూ మొత్తం రూ.4500 కోట్ల ఆర్థికభారం పడుతుందని ఏపీ విద్యుత్తు సంస్థలు లెక్కించాయి. ప్రస్తుతం సంస్థలు నష్టాల్లో ఉన్నందున అంత ఆర్థికభారం మోయలేం అని వారిని చేర్చుకోకుండా సుప్రీంకోర్టుకెళ్లినట్లు తెలుస్తోంది.
వివాదం ఏంటి?
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ విద్యుత్తు సంస్థల్లో ఏపీ స్థానికతతో పనిచేస్తున్న 1,157 మందిని 2015లో రిలీవ్ చేశారు. వారిని చేర్చుకునేందుకు ఏపీ సంస్థలు నిరాకరించాయి. ఆ ఉద్యోగులు సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల ఈ వివాదాన్ని పరిష్కరించాలని జస్టిస్ ధర్మాధికారి అధ్యక్షతన కమిటీని కోర్టు ఏర్పాటు చేసింది. విచారణ అనంతరం వారిలో 655 మందిని ఏపీకి, మిగిలిన వారిని తెలంగాణకు కేటాయిస్తూ గత నెల 26న కమిటీ ఆదేశాలిచ్చింది. కానీ ఆదేశాలను అమలు చేయలేమని ఏపీ తాజాగా తిరస్కరించింది.
ఇదీ చూడండి : లారీ- ప్రైవేటు బస్సు ఢీ... బస్సు దగ్ధం