శాసనసభ బడ్జెట్ సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. స్థానికంగా జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు హాజరుకానున్నారు. వీటితోపాటు తెరాస జిల్లా కార్యాలయాలను ప్రారంభించాలని ఆయన నిర్ణయించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల పర్యటనలు ప్రాథమికంగా ఖరారయ్యాయి. ఆ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు బుధవారం శాసనసభ కార్యాలయంలో సీఎంను కలిశారు. ఆయా జిల్లాల్లోని అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలకు..
వరంగల్ జిల్లా నర్సంపేట, ములుగు నియోజకవర్గాలకు సంబంధించిన రామప్ప- పాకాల చెరువు అనుసంధానం పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఖమ్మం జిల్లా పర్యటనలో దుమ్ముగూడెం వద్ద కొత్త బ్యారేజీకి శంకుస్థాపనతో పాటు మరికొన్ని కార్యక్రమాలకు ఆయన హాజరుకానున్నారు. మరోవైపు 25 జిల్లాల్లో నిర్మిస్తున్న తెరాస కార్యాలయాల ప్రారంభోత్సవాలకు ముఖ్యమంత్రి హాజరవుతారు. ఒక్కో రోజు ఒక్కో ఉమ్మడి జిల్లా పరిధిలోని కార్యాలయాలను ఆయన ప్రారంభిస్తారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఇదీ చూడండి: భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్