కరోనా ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ప్రజలు మునుపటి కంటే జాగ్రత్తగా ఉంటున్నారు. దీనినే ఆసరాగా చేసుకుంటున్న కొందరు అక్రమార్కులు దోచుకుంటున్నారు.
ఎల్.బి.నగర్ పరిధిలోని రాక్‌టౌన్ కాలనీ ఇలాంటి వ్యాపారమే జోరుగా సాగుతోంది. రోజువారీ దినచర్యలో భాగమైన పాలను కల్తీ చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. స్వచ్ఛమైన గేదె పాలు, ఆవు పాలంటూ ప్రజలను మోసం చేస్తున్నారు.
దుకాణాల్లో దొరికే ప్యాకెట్ పాలను కొనుగోలు చేసి, వాటినే క్యాన్లలో పోసుకుని స్వచ్ఛమైన పాల పేరుతో అమ్మేస్తున్నారు. దండిగా డబ్బులు దండుకుంటున్నారు. రోజూ మనకు పాలు పోసేవారే కదా అని నమ్మకంగా తీసుకుంటుంటే.. గుట్టుచప్పుడు కాకుండా మోసం చేస్తున్నారు. మన డబ్బులే తీసుకుని, మన ఆరోగ్యాలకే ముప్పు తెస్తున్నారు.