Adilabad market funds issues : తెల్లబంగారంగా పేరొందిన పత్తిపంటకు ఆదిలాబాద్ జిల్లా ఖండాంతర ఖ్యాతిగాంచింది. పత్తి సహా ఇతర పంటల క్రయవిక్రయాల కారణంగా వచ్చే పన్నుతో మార్కెట్‌యార్డుకు గణనీయమైన ఆదాయం సమకూరుతుంది. రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందు... ఆ తర్వాత మార్కెట్‌యార్డుకు వస్తున్న ఆదాయంలో పెద్దగా వ్యత్యాసమేమీలేదు. వస్తున్న ఆదాయంతో మార్కెట్ యార్డుల్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలేదు. ఆదాయ, వ్యయాల పద్దులు సరిగాలేక... ఖర్చుల్లేక మిగులు నిధులుగా కనిపించడం ప్రభుత్వ దృష్టికి వెళ్తోంది. 2017-18 సంవత్సరంలో సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ మార్కెట్‌యార్డుకు రూ.కోటి, 2018-19లో మంత్రి హరీశ్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట మార్కెట్‌యార్డుకు రూ.3కోట్లు అప్పు ఇచ్చింది. ఈ రెండు మార్కెట్‌యార్డులే కాకుండా రాష్ట్రంలోని వనపర్తి, వట్‌పల్లి, బాధంపల్లి యార్డులకు కలిపి మొత్తం 9.59 కోట్లు అప్పులిచ్చింది. వడ్డీతో సహా వసూలు చేయాల్సి ఉండగా... ఇప్పటిదాకా కేవలం రూ.65లక్షలు వసూలైతే... మరో రూ.8,93 కోట్ల అసలు కూడా వసూలు కాలేదు.
మౌలిక వసతుల్లేవ్..
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గజ్వేల్, సిద్దిపేట మార్కెట్‌యార్డులకు అప్పులిస్తే... అంతకంటే ముందే మిగిలిన వనపర్తి, వట్‌పల్లి, బాధంపల్లి యార్డులకు మార్కెటింగ్‌శాఖ అప్పు ఇచ్చింది. ఇచ్చిన అప్పులను తిరిగిరాబట్టుకోవడం కోసం 2011-12 ఆర్థిక సంవత్సరం నుంచి ఆశగా ఎదురుచూపులు చూస్తోంది. మరోపక్క ఆదిలాబాద్ జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో కనీస మౌలిక వసతుల్లేక రైతులనుంచి విమర్శలను మూటగట్టుకోవాల్సి వస్తుంటే... ఇచ్చిన అప్పులను రాబట్టే ప్రయత్నం చేస్తున్నామనే మాట అధికారుల నుంచి వినిపిస్తోంది.
'ఆదిలాబాద్ జిల్లా మార్కెట్ యార్డుకు ప్రతిసంవత్సరం ఆదాయం ఉంటుంది. గతంలో ఇక్కడ జమ అయిన డబ్బులను ఇతర మార్కెట్లకు తరలించారు. కాంగ్రెస్ హయాంలోనూ ఇలాగే జరిగింది. ఇప్పుడు తెరాస ప్రభుత్వంలో కూడా అదే ఆనవాయితీ కొనసాగుతోంది. వెనుకబడిన ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేయకుండా ఇతర మార్కెట్లకు తరలించడం సరైనది కాదు. ఇక్కడ మౌలిక వసతులు కూడా లేవు. బకాయిలను వసూలు చేసి.. సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. మార్కెట్లో ఉద్యోగాల కొరత ఉంది. ఇక్కడ చాలామంది యువత ఉన్నారు. వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వొచ్చు కదా..!'
-బండి దత్తాత్రి, అఖిలపక్ష రైతు సంఘం కన్వీనర్, ఆదిలాబాద్
ఆరోపణల వెల్లువ
ఈ ఏడాది జిల్లాలోని ఐదు మార్కెట్ యార్డుల ద్వారా మార్కెటింగ్ శాఖకు రూ.18.26 కోట్ల ఆదాయం సమకూరింది. వీటిని కూడా రాష్ట్రంలోని మిగిలిన మార్కెట్‌యార్డులకు అప్పుగా ఇచ్చే ప్రయత్నం అంతర్గతంగా జరుగుతున్నట్లుగా తెలిసింది. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతోనే... మార్కెటింగ్‌శాఖకు వస్తున్న నిధులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నాయనే ఆరోపణ బలంగా వినిపిస్తోంది.
'ముఖ్యమంత్రి ఆదిలాబాద్ నుంచి డబ్బులు తీసుకుపోయి... గజ్వేల్‌లో పెట్టుకుంటున్నారు. హరీశ్ రావు ప్రాతినిథ్యం వహించే సిద్దిపేటకు కూడా ఇక్కడి నుంచి డబ్బులు తరలిస్తున్నారు. ఈ జిల్లా డెవలప్ కావొద్దా? ఆదిలాబాద్ మార్కెట్‌కు అన్ని కోట్ల రూపాయలు ఉంటే? చెత్తా చెదారంతో ఎలా ఉంటుంది? కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. తాగడానికి మంచినీళ్ల సౌకర్యం లేదు. కూచోవడానికి ఆఫీసు లేదు. ఇది మరీ అన్యాయం.'
లోకారి పోశెట్టి, పత్తి రైతు, ఆదిలాబాద్
'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆదిలాబాద్ మార్కెట్ నుంచి ఇతర మార్కెట్లకు అప్పు ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇచ్చాం. బకాయిలను తిరిగి రాబట్టుకుంటాం. ఆ నిధులన్నీ వడ్డీతో సహా తీసుకుంటాం. అందుకు మేం ప్రయత్నిస్తున్నాం. అక్కడ నిధులు సమకూరితే వడ్డీతో సహా మా అప్పు మాకు వస్తుంది.'
శ్రీనివాస్, జిల్లా మార్కెట్ అధికారి, ఆదిలాబాద్
ఇదీ చదవండి: PM Modi on ICRISAT: 'ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలి'