VSP Woman missing: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వివాహిత చిరిగిడి సాయి ప్రియ వ్యవహారంలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఆమె నెల్లూరులో ప్రత్యక్షమైంది. అక్కడ ఓ యువకుడితో సాయి ప్రియ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన భార్య సముద్రంలో కొట్టుకుపోయిందంటూ రెండురోజుల క్రితం సాయి ప్రియ భర్త శ్రీనివాసరావు విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె గల్లంతైనట్లు భావించిన పోలీసులు సముద్రంలో గాలించారు.
రెండు రోజులుగా స్పీడ్ బోట్ల సాయంతో సముద్రంలో.. హెలికాప్టర్ ద్వారా పైనుంచి గాలింపు చేపట్టారు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో అసలు సాయి ప్రియ గల్లంతే అయిందా? ఇంకేదైనా జరిగిందా? అనే అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఆమె నెల్లూరులో ప్రత్యక్షమవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. భార్యభర్తల మధ్య కొన్ని వివాదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ యువకుడితో నెల్లూరు వెళ్లినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను విశాఖ పోలీసులు వెల్లడించే అవకాశముంది.
గాలింపునకు రూ.కోటి ఖర్చు: సాయి ప్రియ అదృశ్యం విషయంలో ఓ ఆసక్తికర అంశం వెలుగుచూసింది. సాయి ప్రియ గాలింపు కోసం అధికారులు సుమారు రూ.కోటి ఖర్చు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా హెలికాప్టర్ సాయంతో గాలింపు చేపట్టడంతో ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై విశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ మాట్లాడుతూ వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించాయని చెప్పారు. ప్రస్తుతం సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం వచ్చిందని.. ఆమెను అక్కడి నుంచి విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
అసలేం జరిగిందంటే..: చిరిగిడి సాయిప్రియ, శ్రీనివాసరావు భార్యాభర్తలు. సాయి ప్రియ విశాఖ ఎన్‌ఏడీ సమీపంలోని సంజీవయ్యనగర్‌లో ఉంటుండగా.. భర్త హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 25వ తేదీ పెళ్లిరోజు కావడంతో అదే రోజు సాయంత్రం భార్యాభర్తలు ఆర్కేబీచ్‌కు వెళ్లారు. రాత్రి 7.30 గంటల సమయంలో తిరిగి వెళ్లిపోదామని అనుకుంటుండగా.. శ్రీనివాసరావుకు ఫోన్ రావడంతో పక్కకు వెళ్లి మాట్లాడి తిరిగి వచ్చేలోపు భార్య కనిపించలేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మంగళవారం ఉదయం నుంచి స్పీడ్‌బోట్లు, నేవీ హెలికాప్టర్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఆమె ఆచూకీ నెల్లూరులో ప్రత్యక్షమవడం గమనార్హం.
ఇదీ చూడండి: పెళ్లి రోజున సరదాగా బీచ్‌కు వెళ్లిన జంట.. అంతలోనే విషాదం..