హైదరాబాద్ నగరంలో మరో అత్యాధునిక ఆస్పత్రి ఏర్పాటైంది. కాచిగూడలోని అంబర్పేట్లో టీఎక్స్ ఆస్పత్రిని రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ప్రముఖ సినీ నటి సమంత శనివారం ప్రారంభించారు. ప్రజలకు ఎలాంటి సేవలు అందించనున్నారని మంత్రులు, సమంత వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తక్కువ ధరల్లో ప్రజలకు అందుబాటులో వైద్య సేవలను అందించేందుకు దోహదపడుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. విదేశాల నుంచి వైద్యం కోసం హైదరాబాద్కు వస్తున్నారని ఆయన తెలిపారు. ఆస్పత్రిని ప్రారంభిస్తున్న యజమాన్యానికి మంత్రి అభినందనలు తెలియజేశారు.
నాణ్యమైన వైద్యం అందిస్తాం
టీఎక్స్ హాస్పిటల్స్ గ్రూప్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలను అందిస్తామని సీఈవో రవీందర్ రెడ్డి తెలిపారు. దాదాపు 200 పడకలతో అత్యాధునిక సదుపాయాలతో ప్రతి రోగికి వైద్యం అందించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అత్యవసర సేవలు, ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, సరసమైన ధరల్లో అధునాతన ఐసీయూఎస్ సేవలందించనున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయంగా శిక్షణ పొందిన నిపుణులైన వైద్య బృందం, అత్యవసర అంబులెన్స్ సేవలతో గుండెపోటు రోగులకు ప్రపంచ స్థాయి ఆరోగ్య సేవలను సరసమైన ధరలకు అందిస్తామని రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీఎక్స్ గ్రూప్ హాస్పిటల్ యాజమాన్యానికి మంత్రులు, సినీనటి సమంత అభినందనలు తెలియజేశారు.