చేప, రొయ్య పిల్లల్లో వ్యాధి కారకాలు ఉన్నట్లు తేలితే లైసెన్సుదారుడిపై చర్యలతో పాటు.. వాటికి చెల్లించిన పూర్తి మొత్తాన్ని రైతుకు వెనక్కి ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ఈ మేరకు ఆక్వాకల్చర్ సీడ్ యాక్ట్‌కు ఏపీ ప్రభుత్వం సవరణలు చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయిలో ఏర్పాటయ్యే చేప పిల్లల పెంపకపు కమిటీకి ఛైర్మన్‌గా మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సభ్య కార్యదర్శిగా కమిషనర్ ఉంటారు. హ్యాచరీ, బ్రూడర్ కేంద్రాలు, చేప పిల్లల యూనిట్లు తప్పనిసరిగా లైసెన్సు తీసుకోవాలి. ధ్రువీకరించని చేప, రొయ్యపిల్లల్ని విక్రయించకూడదు. కొత్తగా హ్యాచరీ, లార్వా, బ్రూడర్ కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకుంటే.. రిజిస్టరు చేసుకుని లైసెన్సుకు దరఖాస్తు చేయాలి. అన్నీ సక్రమంగా ఉంటే 15 రోజుల్లో అనుమతి ఇస్తారు.
అనుమతి లేకుండా చేపల మేత అమ్మకూడదు
చేపల మేతలో యాంటీబయోటిక్, ఫార్మకోలోజికల్ పదార్థాలు ఉండకూడదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మేరకు సంచిపై ధ్రువీకరించాలని సూచించింది. వీటితోపాటు లైసెన్సులేకుండా చేపలు, రొయ్యల మేత వ్యాపారం చేసినా, అనుమతించని, కాలం చెల్లిన దాణాను విక్రయించినా చర్యలు తీసుకుంటారు. చేపల మేత తయారీ, పంపిణీ, పర్యవేక్షణపై ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసింది.
పశ్చిమగోదావరి కేంద్రంగా మత్స్య విశ్వవిద్యాలయం
ఏపీలోని పశ్చిమగోదావరిజిల్లాలో మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రాడ్యుయేట్, పీజీ, డిప్లొమా కోర్సులను బోధిస్తారు. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోనే మత్స్యశాస్త్ర కోర్సులను బోధిస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయం కింద నడుస్తున్న కళాశాలలు, పాలిటెక్నిక్‌లు, ప్రయోగశాలలను కొత్త వర్సిటీలకు బదిలీ చేస్తారు.
మత్స్య విశ్వవిద్యాలయం పరిధిలోకి వచ్చేవి..
- నెల్లూరు జిల్లా ముత్తుకూర్‌లోని మత్స్య విజ్ఞాన కళాశాల, ఎగువమిట్టలోని చేపల, తిరుమలమ్మపాలెంలోని రొయ్యల పెంపకం కేంద్రం, తెగుళ్ల సంరక్షణపై నెట్‌వర్క్ ప్రాజెక్టు
- కృష్ణాజిల్లా భానుదేవరపల్లిలోని మండలి వెంకట కృష్ణారావు ఫిషరీస్ పాలిటెక్నిక్
- తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లా ఉండిలోని మత్స్య పరిశోధనా కేంద్రాలు
- తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలోని ఇన్‌స్ట్రక్షనల్ పరిశోధనా కేంద్రం
- విశాఖపట్నంలోని యాంటీ బయోటిక్ రెసిడ్యూ అధ్యయన కేంద్రం
- ఉండిలోని అడ్వాన్స్ డయోగ్నస్టిక్ లేబరేటరీ.
ఇదీ చదవండి : ప్రతిపక్షాలవి వేర్పాటువాద రాజకీయాలు: కేటీఆర్