రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల్లో చేపడుతున్న రకరకాల పనుల్లో ఐటీ(సమాచార సాంకేతిక పరిజ్ఞానం) జోక్యం కొరవడింది. ఐటీ అనుసంధానం కోసం అయిదేళ్ల క్రితమే సిద్ధమైన ‘యాక్షన్ సాఫ్ట్’ను రాష్ట్రంలో ఇప్పటికీ వినియోగించటం లేదు. జిల్లా, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలకు చెందిన పనుల్లో సామాజిక తనిఖీలు, ఎన్నికైన ప్రతినిధులకు శిక్షణ, స్థానికసంస్థల ఆస్తుల నమోదు తదితరాలకు చెందిన అప్లికేషన్లనూ పంచాయతీరాజ్ శాఖ పట్టించుకోవటమే లేదు. పౌరులకు ఉత్తమ సేవలను అందజేయటమే లక్ష్యంగా కేంద్రం మొత్తం 11 రకాల అప్లికేషన్లను తయారుచేసి ఇవ్వగా.. వాటిలో స్థానిక సంస్థల వివరాల నమోదుకు చెందిన డైరెక్టరీ ఒక్కటే రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలవుతున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది.
అందజేసి అయిదేళ్లయినా...
రకరకాల పనుల్లో ప్రజలను భాగస్వాములను చేయటం, ప్రణాళికల తయారీ, పారదర్శకత తదితరాలు లక్ష్యాలుగా కేంద్రం అయిదేళ్ల క్రితం 11 రకాల అప్లికేషన్లను రూపొందించి రాష్ట్రాలకు అందజేసింది. హార్డ్‌వేర్‌ను సమకూర్చుకోవటానికి, సిబ్బందికి శిక్షణ ఇవ్వటానికి కొంతమేర నిధులనూ ఇచ్చింది. కేంద్ర అప్లికేషన్లకు తాము మరికొన్నింటిని చేర్చి రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టుగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ 2015లో ప్రకటించింది. కార్యదర్శుల కొరత, అంతర్జాల సౌకర్యం లేకపోవటం వంటి సమస్యల వల్ల పంచాయతీల్లోని కంప్యూటర్లు అటకెక్కుతూ వచ్చాయి.
కొత్త పంచాయతీ చట్టం
రాష్ట్రంలో 2018 ఏప్రిల్ నుంచి అమలుచేస్తున్న కొత్త పంచాయతీరాజ్ చట్టంలో భవనాల అనుమతులు తదితరాలన్నీ ఆన్‌లైన్ ద్వారానే అమలుకావాలనే నిబంధన విధించింది. ఇటీవలే సాఫ్ట్‌వేర్‌ను సమకూర్చింది. ప్రస్తుతం మండల కేంద్రాల్లో మాత్రమే డేటా ఎంట్రీ అపరేటర్లతో కంప్యూటర్ల ద్వారా అధికారులు కొన్ని పనులను చేయిస్తున్నారు.
మనుగడకు నోచుకోని సాఫ్ట్‌వేర్
కేంద్రం అందజేసిన 11 అప్లికేషన్లలో ఏడింటి వినియోగంపై ఇటీవల అన్ని రాష్ట్రాల్లో సర్వే జరిపింది. పనుల పురోగతిని, వాటికయ్యే వ్యయాన్ని తెలియజెప్పే అతి ముఖ్యమైన ‘యాక్షన్ సాఫ్ట్’ తెలంగాణలో అసలు మనుగడలోనే లేనట్టు తేలింది. ప్రణాళికల తయారీకి అవసరమయ్యే సహజవనరులు, సామాజిక, ఆర్థిక పరిస్థితులు తదితరాల గణాంకాలను వెల్లడించే ఏరియా ప్రొఫైల్ అప్లికేషన్ వాడకం..ఉమ్మడి జిల్లా, మండల పరిషత్తుల్లో బాగానే ఉన్నా పంచాయతీల్లో మాత్రం అవి 56 శాతానికే పరిమితమయ్యాయి. రాబడి, వ్యయ వివరాల నమోదుకు ఉద్దేశించిన ‘పీఆర్‌ఐఏ సాఫ్ట్’ను జడ్పీల్లో 44, మండల పరిషత్‌లలో 30, పంచాయతీల్లో 70 శాతం వినియోగిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం పంచాయతీల్లో 7 అప్లికేషన్లను వినియోగిస్తున్న పంచాయతీల శాతాలు ఇలా ఉన్నాయి.
ఇదీ చదవండి: 'వ్యక్తిగత గోప్యతను మానవ హక్కులా చూడాలి'