AC Helmets For Traffic Police In Hyderabad : ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఎదుర్కొనే అవస్థలను కొంత వరకు తగ్గించడానికి ఉన్నతాధికారులు పలు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే కూడళ్లలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించే సిబ్బందికి ఏసీ హెల్మెట్లు (శీతల శిరస్త్రాణాలు) అందుబాటులో తేవాలని భావిస్తున్నారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సిబ్బందికి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ట్రయల్ రన్ కూడా పూర్తయింది.
రోజు రోజుకు జంటనగరాల్లో వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం మహానగరం హైదరాబాద్‌లో దాదాపు 80 లక్షల కు పైగా వాహనాలు రహదారులపై రాకపోకలు సాగిస్తుండగా వీటిలో ద్విచక్ర వాహనాల సంఖ్య 57 లక్షలకు పైగానే ఉన్నాయి. ఇక మిగితావి కార్లు, బస్సులు, ఆటోలు ఇతర వాహనాలు. వీటికి తోడు ప్రతి రోజు కొత్త వాహనాలు కూడా రోడ్డెక్కుతున్నాయి.
Traffic Police Summer Problems In TS : అధికారుల చర్యలతో.. 2700 మంది ట్రాఫిక్ సిబ్బందికి ఉపశమనం
AC Helmets for Hyderabad Traffic Police : ఇది హైదరాబాద్ కమిషనరేట్‌లోని ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితి. ప్రధానంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది. ఇక ట్రాఫిక్ జామ్‌ల పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. చినుకు పడినా, ఏ చిన్న జామ్ అయినా దాని ప్రభావం ఆ రోజు అంతా ట్రాఫిక్ పై ఉంటోంది. గంటల తరబడి వాహనాలు రోడ్ల పై నిలిచిపోవడం సాధారణంగా మారిపోయింది. ఈ పరిణామాల మధ్య పలు కూడళ్ల లో ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వర్తించాలంటే ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.
నిత్యం వాహనాల నుంచి వెలువడే శబ్ద, వాయు కాలుష్యాల కారణంగా ట్రాఫిక్ సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది. గతంలో ఉన్నతాధికారులు నిర్వహించిన వైద్య శిబిరాల్లో ట్రాఫిక్ సిబ్బంది పలు రకాల రుగ్మతలు బారిన పడినట్టు తేలింది. ఆయా సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎండాకాలంలో సిబ్బందికి తాగునీరు, గ్లూకోజ్, చలువ అద్దాలు వంటికి అందజేస్తున్నారు.
Hyderabad Police to be provided with AC Helmets : వారికి రాబోయే వేసవిలో శీతల హెల్మెట్లు అందుబాటులోకి తేవడానికి రంగం సిద్దమైంది. హైదరాబాద్ కమిషనరేట్‌లోని ఇప్పటికే నాలుగు జోన్లలో శీతల హెల్మెట్ల వినియోగం ప్రయోగాత్మకంగా పూర్తయింది. హెల్మెట్ల వినియోగం ఎలా ఉంది, సౌకర్యంగా ఉందా, ఇబ్బందులేమైనా తలెత్తుతున్నాయా తదితర అంశాలపై సిబ్బంది అభిప్రాయాలను ఉన్నతాధికారులు తీసుకున్నారు.
అందుకనుగుణంగా మార్పులు చేర్పులు చేసి ఆ తర్వాత హెల్మెట్‌లను పూర్తిస్థాయిలో అందుబాటులో తేవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. శీతల హెల్మెట్లు అందుబాటులోకి వస్తే వేసవి కాలంలో ట్రాఫిక్ పోలీసులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
AC Helmets: హాట్ హాట్ సమ్మర్లో.. ట్రాఫిక్ పోలీసులకు కూల్ కూల్ హెల్మెట్లు