Money stolen from ATM in Hyderabad : ప్రస్తుతం కొందరు యువకులు ఈజీ పద్దతిలో డబ్బులు సంపాదించాలనే నెపంతో చోరీలకు పాల్పడుతున్నారు. విచక్షణను మరిచి ధనార్జనే ధ్యేయంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. నగరాలలో మరీ ఎక్కువగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఏటీఎం టెక్నీషియన్‌గా పని చేస్తున్న వ్యక్తి గుట్టుచప్పుడు కాకుండా ఐదు లక్షల రూపాయలను చోరీ చేసి పరారయ్యాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. పోలీసులు చాలా అప్రమత్తమై దొంగలను 24 గంటల్లోనే అరెస్టు చేశారు.
ఏటీఎం నుంచి రూ. 5 లక్షలు చోరీ: ఏటీఎం చోరీ జరిగిన 24 గంటల లోపే దొంగను అరెస్ట్ చేసి, ఐదు లక్షల రూపాయలను బాలానగర్ సీసీఎస్, కేపీహెచ్‌బీ పోలీసులు రికవరీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ రావు వివరాలు తెలియజేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నంకు చెందిన సుద్దాల హరీశ్(29) చింతల్ ద్వారకనగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతను పెట్రో ఏటీఎం సర్వీసెస్ సంస్థలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఏటీఎం టెక్నీషియన్ కావటంతో కేపీహెచ్‌బీ కాలనీలోని మహారాష్ట్ర బ్యాంక్ ఏటీఎం పాస్వర్డ్ తన దగ్గర ఉంది.
తాళంచెవులు కూడా తన వద్ద ఉన్న సమయంలో వాటితో నకిలీ తాళం చెవులు చేయించాడు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఏటీఎంలోకి ప్రవేశించి తన దగ్గర ఉన్న పాస్వర్డ్, నకిలీ తాళంచెవులు ఉపయోగించి ఏటీఎం మెషిన్ తెరిచి అందులోని 5 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లాడు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా, హరీశ్‌ను గుర్తించారు. ఈరోజు ఉదయం హరీశ్‌ను చింతల్‌లోని అతని నివాసంలో బాలానగర్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని, ఐదు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారని డీసీపీ తెలిపారు.
రూం రెంట్‌కు కావాలని.. కళ్లలో సెనగపిండి కొట్టి.. బంగారం చోరీ: ఇంట్లోకి చొరబడి మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెల తాడు ఎత్తుకెళ్లిన చైన్ స్నాచర్‌ను కెపిహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరించారు. ఖమ్మం జిల్లా కందుకూరు చెందిన మల్లా వేంకటేశ్వర రావు(24) నిజాంపేట్ రోడ్డులోని ప్రశాంత్ నగర్లో నివసిస్తున్నాడు. జాయ్ అలుక్కాస్, మలబార్ గోల్డ్ షోరూంలలో పని చేసి, మానేశాడు. ప్రస్తుతం ఇతను జోమాటోలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో గతంలో పలు చిన్న చిన్న చోరీలకు పాల్పడిన వెంకటేశ్వర రావు.. మరో చోరీకి పన్నాగం పన్నాడు.
శుక్రవారం ఓ ఇంటికి టూలెట్ బోర్డుపై ఉన్న ఫోన్ నంబర్లకు చేసి ఇంట్లో యజమానురాలు తప్ప ఎవరూ లేరు అని నిర్ధారించుకొని, యజమాని మహాలక్ష్మిని ఇల్లు అద్దెకు కావాలంటూ మాటల్లో పెట్టి, కళ్లలో సెనగపిండి చల్లి ఆమె మెడలోని పుస్తెల తాడు తెంపుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, సీసీ కెమెరాలు పరిశీలించి చోరీకి పాల్పడింది బయటవారు కాదనే అనుమానంతో వెంకటేశ్వర రావు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో చేసిన నేరాన్ని అంగీకరించాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు.. అపహరించిన 65 గ్రాముల పుస్తెల తాడును స్వాధీనం చేసుకొని, అతడిని రిమాండుకు తరలిస్తున్నామని డీసీపీ తెలిపారు. 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులను డీసీపీ అభినందించారు.
ఇవీ చదవండి: